
లక్డీకాపూల్: జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్–19 విలయతాండవం కొనసాగుతోంది. వేలల్లో పాజిటివ్ కేసులు తదనుగుణంగా మరణాలూ నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండే మార్గాల అన్వేషణలో నగరవాసులు తలమునకలవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్ నిర్ధారణకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రయత్నంలో కొంత మందికి పాజిటివ్ వస్తుంది. మరి కొంత మందికి నెగిటివ్ వస్తుంది. కోవిడ్ నిర్ధారణ ఫలితాలు సరిగ్గా రాకపోవడానికి పలు కారణాలున్నాయని అపోలో ఆస్పత్రి ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ సునీత నర్రెడ్డి పేర్కొంటున్నారు. ప్రధానంగా పీసీఆర్ టెస్ట్‌తోనే కోవిడ్ పాజిటివ్‌పై స్పష్టత వస్తుందంటున్నారు.
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమన్నారు. వాస్తవానికి ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని డాక్టర్ సునీత సూచించారు. ‘పాజిటివ్ వచ్చిన కొంత మంది రోగులకు మళ్లీ పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిన సందర్భాలూ లేకపోలేదు. కింద శ్వాస కోశంలో ఎక్కువ వైరస్ లోడ్ ఉంటుంది. కోవిడ్ నిర్ధారణకు ల్యాబ్‌లో శాంపిల్‌ను పైన శ్వాసకోశం నుంచి తీసుకుంటారు. వ్యాధి సహజ చరిత్ర, శాంపిల్ కలెక్షన్ టెక్నిక్ అంశాలతోపాటు వ్యాధి నిర్ధారణకు పీసీఆర్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది’ అని డాక్టర్ సునీత తెలిపారు. కొంత మంది రోగుల పాజిటివ్ నిర్ధారణకు 2 కంటే ఎక్కువ సార్లు నాసోఫారింజయల్ స్వాబ్స్ చేయాల్సి ఉంటుందన్నారు. వాస్తవానికి కోవిడ్–19 ఊహాత్మక నిర్ధారణకు సీటీ స్కాన్ (చెస్ట్) పరీక్ష ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. అయితే ఆ టెస్ట్ ద్వారా కచ్చితమైన నిర్ధారణ ఫలితాలు వెలువడవని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ టెస్ట్ అత్యుత్తమమైన ప్రామాణికత కాదని కూడా డాక్టర్ సునీత స్పష్టం చేశారు.
కోవిడ్ టెస్ట్ ఇలా...
కరోనా వైరస్‌ను పీసీఆర్ ద్వారా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఆర్‌టీ పీసీఆర్, సెఫిడ్– జెనెక్స్‌పర్ట్, ట్రూనాట్ టెస్ట్‌లు చేస్తారు. ఈ విధంగా వైరస్ నిర్ధారణలో పీసీఆర్ టెస్ట్ 60 నుంచి 70 శాతం సెన్సిటివిటీతోపాటు 95 శాతానికి పైగా ప్రత్యేకతను సంతరించుకుంటుందని డాక్టర్ సునీత పేర్కొన్నారు. పాజిటివ్ ఫలితం అంటే వ్యాధి సోకినట్టుగా నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. సెన్సిటివిటీ 70 శాతం ఉన్నా నెగిటివ్ టెస్ట్ ఫలితాలు వ్యాధి లేదని నిర్ధారించలేవని ఆమె పేర్కొన్నారు.
యాంటిజెన్ తీరు ఇదీ...
వ్యాధి మొదట పాజిటివ్‌గా ఉంటుంది. సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీలు పీసీఆర్‌కు ఒకే రకంగా ఉంటాయి. యాంటిజెన్ పాజిటివ్‌గా ఉన్నప్పడు వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారిస్తుందని డాక్టర్ సునీత చెబుతున్నారు. అయితే నెగిటివ్ కానీ అనుమానాస్పద ఫలితాలు వస్తే.. అప్పుడు వ్యాధి నిర్ధారణకు పీసీఆర్ టెస్ట్ అవసరం అవుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఐజీజీ విషయానికొస్తే అంటువ్యాధి సోకిన చాలా వారాల తరువాత పాజిటివ్ అవుతుంది. అదే ఐజీఎం విషయానికి వస్తే.. అంటువ్యాధి సోకిన కొద్ది రోజుల్లో పాజిటివ్ నిర్ధారణ అవుతుందని డాక్టర్ సునీత వివరించారు.
పీసీఆర్ చేయాలా...
‘వ్యాధి సోకిందనే విషయం తెలుసుకోవడానికి పీసీఆర్ టెస్ట్ చేయకూడదు. ఎందుకంటే వైరస్ తొలగే ప్రక్రియ దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. చనిపోయిన, సజీవంగా ఉన్న వైరస్‌లను రెంటింటినీ పీసీఆర్ పరిగణనలోకి తీసుకుంటుంది. పీసీఆర్‌తో పాటు సీటీ స్కాన్ కూడా సెన్సిటివ్ టెస్ట్. వాస్తవానికి ఈ టెస్ట్‌ను వైద్య పరిస్థితి నిర్ధారణకు ఉపయోగిస్తారు’ అని డాక్టర్ సునీత స్పష్టం చేస్తున్నారు.