ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో! | Clarity to be come on RTC strike today | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో!

Published Wed, May 13 2015 2:31 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో! - Sakshi

ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో!

* ఆర్టీసీ సమ్మెపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
* మంగళవారం రాత్రి వరకు చర్చలు.. తేలని ఫలితం
* 40 శాతం వరకు ఫిట్‌మెంట్‌కు మంత్రుల కమిటీ సిఫారసు

* బుధవారం మరోసారి అధికారులతో సమావేశమై నిర్ణయం
* కార్మికుల సమక్షంలో ఫిట్‌మెంట్ ప్రకటించనున్న సీఎం!
* 40 శాతానికిపైగానే ఇచ్చేదిశగా సంకేతాలు

 
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బుధవారం అటో ఇటో తేలిపోనుంది. మధ్యాహ్నం సమయానికి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. కార్మికులు డిమాండ్ చేస్తున్న స్థాయిలోనే ప్రభుత్వం ఫిట్‌మెంట్ ప్రకటించేదిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు, కార్మిక సంఘాలు మంగళవారం రాత్రి వరకూ సుదీర్ఘంగా చర్చలు జరిపినా.. తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ మరోసారి అధికారులతో భేటీకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గం టల సమయంలో కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రే స్వ యంగా ఫిట్‌మెంట్‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. మరోవైపు సమ్మెపై బుధవారం ఉదయం 10.30లోగా తేల్చాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే మంగళవారం తుది నిర్ణయాన్ని వెల్లడించలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
 
 సుదీర్ఘంగా చర్చలు..
 మూడు రోజుల పాటు కార్మిక నేతలతో చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సీఎంకు తుది నివేదికను అందజేసింది. ఫిట్‌మెంట్‌కు సంబంధించి 37 శాతం ఇస్తే ఎలా ఉంటుంది, 40 శాతం ఇస్తే పరిస్థితేమిటన్న వివరాలను క్రోడీకరించింది. మధ్యాహ్నం తర్వాత 40 శాతంపైనే చర్చలు జరిగాయి. తర్వాత అనూహ్యంగా 43 శాతం ప్రకటిస్తే పరిణామాలేమిటని సీఎం ప్రశ్నించడంతో ఆదిశగా చర్చలు కొనసాగాయి. దీనిపై ఆర్టీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం మంత్రులు, అధికారులతో మాట్లాడారు. వరుసగా రెండు మూడేళ్లపాటు ఆర్టీసీ చార్జీల పెంపు, డీజిల్‌పై వ్యాట్ 4 శాతానికి తగ్గింపు, లేదా వ్యాట్ మొత్తం ఆర్టీసీకి రీయింబర్స్ చేయడం, విడిభాగాల కొనుగోలుపై పన్ను 5 శాతానికి తగ్గింపు, అతి తక్కువ వడ్డీ వసూలు చేసే విదేశీ రుణ సంస్థల నుంచి అప్పు పొందే వెసులుబాటు, ప్రస్తుత రుణాలను ప్రభుత్వం భరించటం.. ఇలాంటి అంశాలపై చర్చ కొనసాగింది.
 
 మీ సత్తా ఏమిటి?
 చర్చల సమయంలో ఆర్టీసీ అధికారులపై సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఫిట్‌మెంట్ భారాన్ని ఈసారి ప్రభుత్వం భరిస్తుందనుకుందాం. దాని ప్రభావం ఇప్పటికిప్పుడు పడకుండా కొన్ని ఆర్థికపరమైన వెసులుబాట్లు కల్పిస్తుందనుకుందాం. మరి భవిష్యత్‌లో మళ్లీ సాయం కోసం రారనే గ్యారంటీ ఏమిటి? అంతర్గతంగా సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్టీసీ సత్తా ఏమిటి?’’ అని సీఎం నిలదీసినట్లు సమాచారం. బస్సుల్లో జనాలు వేలాడుతూ ప్రయాణిస్తున్నా నష్టాలు రావటానికి కారణాలేమిటని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి అధికారులు చెప్పిన సమాధానాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం.
 
 బాండ్ల రూపంలో..?

ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ గడువు 2013 మార్చి 31తో పూర్తయింది. ఇప్పుడు ఎంత ఫిట్‌మెంట్ ప్రకటించినా.. ఆ తేదీ నుంచే అమలు చేయాలి. అయితే ఈ రెండేళ్ల బకాయిలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతున్నాయి. 40 శాతమో లేదా 43 శాతమో ఫిట్‌మెంట్ ప్రకటి స్తే బకాయిల ఊసెత్తకుంటే మంచిదనే దిశగా కూడా చర్చ సాగింది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం పడకుండా బాండ్ల రూపంలో ఇస్తే ఎలా ఉంటుందనే యోచన వచ్చింది. కాానీ తుది నిర్ణయానికి రాలేదు.
 
 కార్మికుల్లో ఉత్సాహం..

 సీఎం స్వయంగా భారీగానే ఫిట్‌మెంట్‌ను ప్రకటించనున్నారన్న ప్రచారంతో మంగళవారం ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో సచివాలయానికి చేరుకున్నారు. పరస్పరం అభినందించుకోవడం, సన్నిహితులకు ఫోన్లలో చెప్పుకోవడం కనిపించింది. కానీ రాత్రి పొద్దుపోతున్నా సీఎం నుంచి పిలుపు రాకపోవడంతో.. కార్మికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమైంది. అయితే చర్చల అనంతరం వెలుపలికి వచ్చిన మంత్రి నాయిని ఫిట్‌మెంట్ బాగానే ఉంటుందన్నట్లుగా కార్మికులకు పరోక్ష సంకేతం ఇవ్వడంతో తిరిగి సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం నాయిని పుట్టినరోజు కావటంతో కొందరు కార్మిక నేతలు ఆయనకు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ‘మీకు కూడా శుభాకాంక్షలు, రేపు శుభవార్త వినబోతున్నారు’ అని నాయిని పేర్కొనడం గమనార్హం. సీఎం తుది నిర్ణయం పూర్తి సానుకూలంగా ఉండబోతోందంటూ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కూడా కొందరు కార్మిక నేతలతో వ్యాఖ్యానించటం విశేషం.
 
 సమ్మె కొనసాగుతుంది:
 ‘‘సీఎం వద్ద చర్చలు కొలిక్కివచ్చినందున సమ్మెను ముగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వాటిని కార్మికులెవరూ నమ్మొద్దు. 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించేవరకు సమ్మె కొనసాగుతుంది. కూటమి నాయకత్వం నుంచి విరమణ ప్రకటన వచ్చేవరకు ఎవరూ వెనక్కుతగ్గొద్దు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. సమ్మె ప్రాధాన్యం, దాని రాజ్యాంగబద్ధతను బుధవారం కోర్టుకు వెల్లడించబోతున్నాం.’’
 - టీఎంయూ, ఈయూ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి
 
 ఎంసెట్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గురువారం జరగనున్న ఎంసెట్‌కు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎంసెట్ రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు వాహనాలు సమకూర్చే బాధ్యతను అధికారులు చేపట్టాలని ఆదేశించింది. సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. మండలాల వారీగా ఎంత మంది విద్యార్థులున్నారు, వారు ఏయే సెంటర్లకు వెళ్లాలి, ఎన్ని వాహనాలు అవసరమన్న అంశాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి వరకు జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఎంసెట్ రాసే ప్రతి విద్యార్థినీ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement