పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు.
పెద్దపల్లి కలెక్టర్‌ను అడ్డుకున్న విద్యార్థులు
పెద్దపల్లి అర్బన్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. పెద్దపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పుస్తకాలతో పాటు నిరసన చేపట్టారు. కలెక్టర్ గది ముందు కూర్చుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాఠాలు చదువుతూ తమ నిరసన గళాన్ని వినిపించారు.
‘మా బడి మాగ్గావాలె.. వేరే బడికి వెళ్లేది లేదం’టూ ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కారుకు అడ్డంగా కూర్చున్నారు. అధికారులు ఎంతగా బతిమిలాడినా విద్యార్థులు పట్టు వీడలేదు. తమ పిల్లలకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్ తల్లిదండ్రులు, నేతలతో మాట్లాడారు. తన చేతిలో ఏమిలేదని, బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగితే తప్పా.. చేసేదేమీ లేదన్నారు. విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని చెప్పటంతో ఆందోళన విరమించారు.