* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఫిర్యాదు
* ఎంసెట్, నదీ జలాల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తోంది
* గతేడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల నుంచే వివాదం ప్రారంభం
* మమ్మల్ని సంప్రదించకుండానే ఇంటర్, ఎంసెట్ తేదీల ప్రకటన
* కిన్నెరసాని ప్రాజెక్టును దక్కించుకునే యత్నం చేస్తోందని ఆరోపణ
* విద్యుత్ విషయంలోనూ చిక్కులు తెస్తోందని ఏపీపై మండిపాటు
* నూటికి నూరు శాతం సీలేరు తెలంగాణకే దక్కుతుందని వివరాలతో నివేదిక
* గవర్నర్‌తో ఏకాంతంగా గంటన్నరపాటు భేటీ అయిన తెలంగాణ సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్న విషయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వానిదే తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తోందని వివరించారు. ఆయా అంశాలకు సంబంధించిన పత్రాలు, రుజువులు కూడా అందజేశారు. గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, రాజయ్య, ఎంపీ వినోద్‌కుమార్‌తో కలసి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు.
గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సీఎం కేసీఆర్ ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. సాధారణంగా పావుగంట నుంచి అరగంట వరకు సమావేశం కావడం పరిపాటి. కానీ నరసింహన్, కేసీఆర్ ఇద్దరూ దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇతరులెవరినీ లోనికి అనుమతించకపోవడం గమనార్హం. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వస్తున్న ఇబ్బందులను సీఎం గవర్నర్‌కు సుదీర్ఘంగా వివరించారు. ఇంటర్, ఎంసెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వెల్లడించారు.
కనీసం తమతో సంప్రదించకుండానే ఇంటర్, ఎంసెట్ తేదీలను ప్రకటించిన సంగతిని గవర్నర్ దృష్టికి తెచ్చారు. అందువల్లే తాము ప్రత్యేకంగా తేదీలను ప్రకటించాల్సి వచ్చిందని వివరించారు. గత ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలోనూ తమతో విభేదించారని... అప్పటి నుంచి వారి వ్యవహారశైలి ఏకపక్షంగానే కొనసాగుతోందని గవర్నర్‌కు సీఎం తెలిపారు. నదీ జలాల విషయంలోనూ పొరుగు రాష్ట్రం కావాలని వివాదాలు సృష్టిస్తోందన్నారు. సీలేరు ప్రాజెక్టు ఎప్పటికీ తెలంగాణదేనంటూ దాని చరిత్రను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. దాంతోపాటు ఇప్పుడు బూర్గంపహాడ్‌ను కూడా కావాలని ఏపీ కోరుతోందని... కిన్నెరసాని ప్రాజెక్టును దక్కించుకుని తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్నా.. తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆగమేఘాల మీద విద్యుత్ సమస్యను ఏపీ తెరపైకి తెచ్చి ఇబ్బందులకు గురి చేసిందని వివరించారు. కాగా.. ఎంసెట్ విషయంలో తాను చేసిన సూచనలపై సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని గవర్నర్ నరసింహన్ కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని బట్టి తాము నడుచుకుంటామని సీఎం చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
నేడు కేరళ పర్యటనకు సీఎం
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కొచ్చి నగరానికి బయలుదేరుతారు. అక్కడ రాత్రి బస చేసి.. శనివారం త్రిసూర్‌లో జరిగే లూలూ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అష్రాఫ్ అలీ కుమార్తె వివాహానికి కేసీఆర్ హాజరవుతారు. అనంతరం పీచి డ్యామ్ సమీపంలో ఉన్న కేరళ అటవీ పరిశోధన ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించి, అధికారులతో సమావేశమవుతారు.
అన్నింటికీ అడ్డంకులే
Published Fri, Jan 2 2015 12:39 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement