తప్పు చేసినవారిని వదలొద్దు
► బోధన్ స్కాం దోషులను కఠినంగా శిక్షించాలి: సీఎం కేసీఆర్
► ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులను బదిలీ చేయండి
సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంను తీవ్రంగా పరిగణించాలని సీఎం కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. సమగ్రమైన దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం వాణిజ్య పన్నుల శాఖపై సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు అధికారులు సుదీర్ఘకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోనే పని చేస్తున్నారని, వారిని గుర్తించి బదిలీ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసిన వారిని వదల కూడదన్నారు. ‘‘ఇలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగే ఆస్కారం ఉందా..? అలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..’’ అని ఆరా తీశారు.
‘‘కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. అవినీతి అరికట్టే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. అక్కడక్కడా ఇంకా అవినీతి చోటుచేసుకుంటున్నదంటే.. అది గత ప్రభుత్వాల అవలక్షణం. మనం ప్రభుత్వ యంత్రాంగాన్నీ, పాలనా పద్ధతులను ప్రక్షాళన చేసినప్పటికీ.. మన మంచితనాన్ని అలసత్వంగా తీసుకుని కొందరు ఇలా చేసున్నారు. ఇలాంటి దొంగలను పట్టుకుని భవిష్యత్‌లో అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ రూపొందించుకోవాలి. అవినీతి వాతావరణం మన రాష్ట్రంలో ఏ మాత్రం ఉండటానికి వీల్లేదు’’ అని సీఎం పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి ఈటæల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పటిష్టంగా పనిచేయాలని సీఎం పేర్కొన్నారు. పన్నుల వసూలు, వినూత్న విధానాలతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ దేశంలో నంబర్ వన్‌గా నిలవా లని అన్నారు. శాఖను మరింత పటిష్ట పరిచేం దుకు సరైన వ్యూహం తయారుచేసుకోవాలని అధికారులకు సూచించారు.