సమీక్షకు టీఎంయూను మాత్రమే పిలవడంపై
ఈయూ, టీఎస్ ఎన్‌ఎంయూ ఆగ్రహం
ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించటమేనని విమర్శ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై సీఎం సమీక్షా సమావేశానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలను మాత్రమే ఆహ్వానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఎంయూను మాత్రమే ఆహ్వానించారని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ మండిపడ్డాయి. ఓవైపు సీఎం సమీక్ష సమావేశం జరుగుతుండగా ఈ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని... ఇలాంటి తరుణంలో ఒక సంఘానికి అనుకూలంగా ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపించాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంయూకు అనుకూల ఫలితాలు రావటానికే ఇలా చేశారని, దీనిపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించడం ఏమిటని టీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, లక్ష్మణ్, రఘురాం, ఈయూ నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాల నేతలు ఉంటే అధికారుల బండారం బయటపడుతుందన్న భయంతోనే తమను సమావేశానికి ఆహ్వానించలేదన్నారు.
జరిగిందేమిటి?
శుక్రవారం జరిగే సమీక్షకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని గురువారం నాటి సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రస్తుతం గుర్తింపు సంఘం అంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు అన్ని సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం వెళ్లాలి. లేదా గత ఎన్నికల ఫలితాల ఆధారంగా గుర్తింపు సంఘం నేతలను ఆహ్వానించాలి. అంటే గత ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ సంయుక్తంగా గుర్తింపు యూనియన్‌గా నిలిచినందున.. ఆ రెండు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలి. కానీ టీఎంయూ నేతలను మాత్రమే ఆహ్వానించడం వివాదానికి కారణమైంది.