హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్
► 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
► కరీంనగర్‌లో లక్ష మొక్కల కార్యక్రమానికి శ్రీకారం
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారం పథకం మూడో విడతను రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బుధవారం కరీంనగర్‌లో ప్రారంభించారు. లోయర్ మానేర్ డ్యామ్ వద్ద లక్షమొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.మానేరు తీరంలో మహాగని మొక్కను నాటారు. మూడో విడతలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కోటి ఎకరాలకు నీరందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు దిగులు చెందవద్దని ఎరువులకు ఎకరాకు రూ.8 వేలు ప్రభుత్వమే ఇస్తుందని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో తెలంగాణలో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కల్తీరాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, పేకాటను పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్‌హాల్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు.