సాక్షి, ఆదిలాబాద్: కొత్త జిల్లా కలెక్టర్ దేవసేన సోమవారం సాయంత్రం 7గంటల తర్వాత బాధ్యతలు స్వీకరించాక కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్నారు. అనంతరం ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు. రెండుమూడు రోజుల పాటు కలెక్టర్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండరని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. సాధారణంగా కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మరుసటి రోజు వివిధ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తారు. అయితే మంగళవారం అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎలాంటి సందడి కనబడలేదు. సోమవారం రాత్రి కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్న ఆమె హైదరాబాద్‌కు పయనమయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బదిలీల కంటే ముందు ఆమె హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నించారని సమాచారం. అయినప్పటికీ ఆదిలాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అయిన కలెక్టర్లు వెనువెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆమె సోమవారం సాయంత్రమే ఇక్కడికి వచ్చి విధుల్లో చేరారు.
హైదరాబాద్‌కు చెందిన అల్లమరాజు దేవసేన పరిపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతోపాటు ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించగల తత్వం కలిగి ఉన్నారు. 1997లో గ్రూప్–1కు ఎంపికయ్యారు. హైదరాబాద్ ఆర్డీఓగా, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 2008లో కన్‌ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. అటుపై సెర్ప్ డైరెక్టర్‌గా, ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాగా ఏర్పడిన జనగామ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. అక్కడ ఏడాదిపైగా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ సంబంధిత వ్యవహారాల్లో అక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఎదురించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారనే పేరుంది. దేవసేన 2018 జనవరిలో పెద్దపల్లి కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ ఏడాదికిపైగా పనిచేశారు. ఆమె కృషి ఫలితానికి మూడు జాతీయ అవార్డులూ వరించాయి.
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
Published Wed, Feb 5 2020 7:56 AM | Last Updated on Wed, Feb 5 2020 7:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment