జుట్టు రాలె..కన్ను పాయె! | complaints on fake doctors to medical council | Sakshi
Sakshi News home page

జుట్టు రాలె..కన్ను పాయె!

Published Fri, Feb 16 2018 7:58 AM | Last Updated on Fri, Feb 16 2018 7:58 AM

complaints on fake doctors to medical council  - Sakshi

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

సౌదీ అరేబియాకు చెందిన తారిక్‌ కుస్సు బట్టతలపై జుట్టు కోసం బంజారాహిల్స్‌లోని ఓ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌లో సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ వికటించి కంటిచూపు కోల్పోయాడు. బాధితుడు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేస్తే సదరు వైద్యుడు అసలు సర్జనే కాదని తేలింది.  మెడికల్‌ టూరిజానికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో ఇతర దేశాలతో పోలిస్తే వైద్యం చాలా చౌక. తక్కువ ధరకే మెరుగైన వైద్యం పొందే వీలుంది. దీంతో విదేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. అయితే అక్రమ సంపాదనే లక్ష్యంగా కొందరు వైద్యులు చికిత్స ముసుగులో అనైతిక చర్యలకు పాల్పడుతుంటే.. ఏ అర్హతలూ లేని అనేక మంది శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై ఏడాది కాలంలో తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు 40 ఫిర్యాదులు అందాయి.

అనైతిక వైద్యసేవలు.. వైద్యసేవల్లోనిర్లక్ష్యం.. వంటి ఘటనలపై తెలంగాణమెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదులువెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటి వరకు40 ఫిర్యాదులు అందగా, వీటిలోఇప్పటికే నలుగురు వైద్యులపైరెండు నుంచి ఐదేళ్ల పాటు సస్పెన్షన్‌వేటు విధించారు.  తాజాగా మరో వైద్యుడిపై రెండేళ్ల పాటు వేటువిధించింది. మరో ఐదుగురు వైద్యులకు హెచ్చరిక ఇచ్చి పంపింది.  

సాక్షి, సిటీబ్యూరో: వృత్తిపట్ల అంకిత భావం, వైద్య రంగంలో కనీస అనుభవం లేని వారు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. నిపుణులతో పాటు ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేకపోయినా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులుగా చెలామణి అవుతూ.. నిపుణులు, వారు చేసిన చికిత్సలపై ప్రచారం చేసుకుని రోగులను మభ్య పెడు తున్నారు. తీరా ప్రాణాల మీదకు వచ్చే సరికి ‘మా వల్ల కాదు..’అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అప్పటికే రోగం మరింత ముదిరి పోవడంతో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల అనేక మంది మత్యువాత పడుతున్నారు. కానీ ఇవేవీ బయటికి రావడం లేదు. ఒక వేళ వచ్చినా, వారు కూడా ఆ క్షణానికి హంగమా సృష్టించి రూ.లక్షో..రెండు లక్షలు నష్టపరిహారంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వైద్య పరమైన నిర్లక్ష్యంపై ఆస్పత్రులను కోర్టులకు ఈడుస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  

మచ్చుకు కొన్ని ఫిర్యాదులు...
సౌదీఅరేబియాకు చెందిన తారిక్‌ కుçస్సు బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 1లోని ఖాన్స్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌లో సర్జరీ చేయించుకున్నాడు.  డాక్టర్‌ ఇష్రత్‌ ఉల్లా ఖాన్‌ చేసిన సర్జరీ వికటించడంతో రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కంటిచూపును కూడా కోల్పొవాల్సి వచ్చింది. దీంతో  బాధితుడు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు సదరు కేంద్రానికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. సదరు వైద్యుడు అసలు సర్జనే కాదని తేలింది. కనీస వైద్య సదుపాయాలు లేని సెంటర్‌లో ఓ ఎంబీబీఎస్‌ డాక్టర్‌ ఎలాంటి అర్హతలు లేకుండా కాస్మొటిక్‌ సర్జరీ చేయడం వల్లే వైద్యం వికటించినట్లు గుర్తించింది. అనైతిక వైద్యానికి పాల్పడిన ఆ వైద్యుడిపై రెండేళ్లపాటు సస్పెన్షన్‌ వేటు విధించింది.

కేన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సంతోష్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో  డాక్టర్‌  ఏక్యూ  టెర్రి రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ ఏకంగా కీమోథెరపీ నిర్వస్తున్నాడు. కేన్సర్‌ అడ్వాన్స్‌ స్టేజీ లో ఉన్న రోగులకు ఖరీదైన మందులు సూచిస్తూ మోసం చేస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెడికల్‌ కౌన్సిల్‌ బృందం ఆ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి, సదరు డాక్టర్‌కు హెచ్చరించింది.

సంగారెడ్డిలో కొంతమంది వైద్యులు అన వసరంగా సిజేరియన్లు నిర్వహించారు. ఈ అం శంపై జిల్లా కలెక్టర్‌ ఐదు ఆస్పత్రులపై ఫిర్యాదు చేశారు.  ఎథిక్స్‌ కమిటీ బృందం ఇటీవల ఆయా ఆస్పత్రులను తనిఖీ చేసింది. అక్రమ సంపాధనే లక్ష్యంగా సిజేరియన్లు చేసినట్లు గుర్తించింది. జిల్లా కలెక్టర్‌కు నివేదిక కూడా అందజేసింది. 

నిమ్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఓ వై ద్యుడు తన వద్దపని చేస్తున్న పీజీ వైద్యుల ప ట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో...  ఆయన్ను హెచ్చరించి పంపింది. 

న్యూబోయిన పల్లిలోని ఓ ఆస్పత్రిలో చని పోయినవ్యక్తిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం చేసినట్లు నటించారు. బాధితులు గొడవ చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం వారికి పరిహారం అందజేసింది.

కమీషన్లు ఇవ్వడం నేరమే
రోగుల పట్ల సున్నితంగా వ్యవహరించడం, వారి బాధలను సహృదయంతో అర్థం చేసుకోవాలి. వైద్యులు రోగుల మెడికల్‌ రికార్డులను మూడేళ్ల పాటు విధిగా భద్రపరచాలి. గ్రామీణ ఆర్‌ఎంపీ వైద్యులకు కమిషన్‌లు చెల్లించడం, వారి ద్వారా రోగులను రప్పించుకోవడం నేరం. సర్జరీలపై  వైద్యుడి పేరుతో వ్యాపార ప్రకటనలు ఇవ్వడం నైతిక విరుద్ధం.   – డాక్టర్‌ రాజలింగం,వైస్‌ చైర్మన్, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌

కఠినంగా వ్యవహరిస్తాం
గతంతో పోలిస్తే ప్రస్తుతం వైద్య చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ చికిత్స దేనికి చేస్తారో? ఏ మందులు ఏ జబ్బుకు సూచిస్తారో? అనే అంశం వైద్యవృత్తితో  సంబంధం లేని సగటు మనిషికి కూడా తెలిసి పోయింది. వైద్యపరమైన నిర్లక్ష్యంపై సంబంధిత ఆస్పత్రులను, వైద్యులను నిలదీస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులపైనే కాదు వారి వద్ద వైద్యవిద్య నేర్చుకుంటున్న విద్యార్థులు, వారి ఫిర్యాదులను కూడా స్వీకరించి హెచ్చస్తున్నాం.   – డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement