సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమైందని, పార్టీ నడపడం చేతగాని ఆ నేతలంతా టీఆర్‌ఎస్‌పై పడి ఏడుస్తున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో అభివృద్ధి లేకుండానే.. ప్రజ లంతా టీఆర్‌ఎస్‌ను తిరిగి గెలిపించారా.. తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలకు పార్టీ నడపడం చేత కాక మా మీద పడి ఏడుస్తున్నారు. ఉన్న పది మంది కాంగ్రెస్ నేతల్లో ఒకరంటే మరొకరికి పడదు.
వలసలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేప్పుడు ఈ నీతులు ఎటు పోయాయి. కాంగ్రెస్ నేతలు దద్దమ్మ ల్లా మారారు. కాంగ్రెస్ తెలంగాణలో భూస్థాపితం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ కూడా మాట్లాడుతోంది. మతాన్ని నమ్ముకుని, అమ్ముకుని ఓట్లడిగే పార్టీ బీజేపీ. మోదీ దేశానికి చేసిందేమీ లేదు. 2 ఎంపీ సీట్లతో కేసీఆర్ తెలంగాణ సాధించారు. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సినవి తెస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతికి పారిపోయిన దొంగ.. బాబు
ఓటుకు కోట్లు కేసులో దొరికి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అని తలసాని అన్నారు. ‘ఏపీ ప్రజలు మోసగాడైన బాబును ఇంటికి పంపా లని ఎపుడో నిర్ణయించుకున్నారు. ఎన్నికల కోసమే పసుపు–కుంకుమ పేరిట డబ్బులు ఇస్తున్నారు. ఇది దగా.. మోసం.. కేసీఆర్‌ను ప్రతిక్షణం తలుచుకోవడమే బాబు బతుకు. బాబు ప్రసంగాలతో జనాలకు బోర్ కొడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మాట దేవుడెరుగు.. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టలేక పోయారు. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోంది.. రాసి పెట్టుకోండి. 22 నుంచి 23 ఎంపీ సీట్లు వైసీపీకి రావడం ఖాయం. ఓడిపోయాక చంద్రబాబు చేరుకునేది హైదరాబాద్ ఇంటికే’ అని వ్యాఖ్యానించారు.
బాబు చరిత్ర నా దగ్గరుంది..
‘చంద్రబాబు ఓడిపోతారనే భయంతో కేసీఆర్ మీద ఏదేదో మాట్లాడుతున్నారు. చేసింది చెప్పుకోలేకే బాబు చిల్లరగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబువి అన్నీ దొంగ మాటలే. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను టీఆర్‌ఎస్ బెదిరిస్తుందంటూ బాబు ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌కి బాబు మాటలే ఫ్రీ పబ్లిసిటీ. అందరి చరిత్రలు బయటపెడతా అని బాబు అంటున్నారు. బాబు చరిత్ర నా దగ్గర ఉంది’ అని తలసాని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment