పాత కాపులే.. | Congress Gives Ticket To Sitting MLA's Mahabubnagar | Sakshi
Sakshi News home page

పాత కాపులే..

Published Tue, Nov 13 2018 8:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Gives Ticket To Sitting MLA's Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఊరిస్తూ వస్తున్న మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌ అభ్యర్థుల వివరాలను పాక్షికంగా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానం విడుదల చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని.. అదీ మంగళవారం ఉదయం వెల్లడించే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరిగింది. ఈ మేరకు మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి మహబూబ్‌నగర్, మక్తల్‌ అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు. అయితే, ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, కొల్లాపూర్‌ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. కాగా, జాబితా విడుదలకు ముందు స్వయంగా పార్టీ అధినేత రాహుల్‌గాంధీ సమక్షంలో తీవ్ర కసరత్తు జరిగిందని సమాచా రం. ఫలితంగా మంగళవారం అనుకున్నప్పటికీ సోమవారం రాత్రే జాబితా విడుదల కావడం విశేషం. ఇక మిగిలిన మూడు స్థానాలను ఎవరికి, ఎప్పుడు ప్రకటిస్తారన్నది తేలాల్సి ఉంది.


కొలిక్కి వచ్చినా మారని తీరు 
మహాకూటమి సీట్ల పంపకాలు, సర్దుబాటు వం టి అంశాలు కొలిక్కి వచ్చినా జాబితా విడుదల లో మాత్రం ఆలస్యం జరిగింది. రెబెల్స్‌ బెడద నుంచి తప్పించుకోవడం కోసమే అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేసినప్పటికీ... ప్రమాదం పొం చి ఉన్నట్లే కనిపిస్తోంది. కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీకి మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలను కేటాయించారు. అయితే ఈ రెండు స్థానాల ను టీడీపీకి కేటాయించడంపై కాంగ్రెస్‌ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ విషయంలో రెండు, మూడు రోజులుగా కాంగ్రెస్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి కార్యకర్తల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్‌గా బరిలో నిలవనున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్థానం కోసం ఆఖరి వరకు ప్రయత్నం చేసిన టీజేఎస్‌ కూడా ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని భావిస్తోంది. ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పోటీకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మహబూబ్‌నగర్‌లో సమావేశమైన పార్టీ నేతలు ఆయనను బరిలో ఉండాలని కోరారు. అదే విధంగా మక్తల్‌లో కూడా టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇలా కూటమి లెక్కులు, పొత్తులు ఎక్కడికి దారితీస్తాయో అనేది చర్చనీయాంశంగా మారింది.   


కొంప ముంచనున్న గ్రూపు తగాదాలు 
ఇప్పటికే ఓవైపు మహాకూటమి పొత్తు కారణంగా సతమతమవుతున్న కాంగ్రెస్‌ కేడర్‌కు... పార్టీలో ని గ్రూపు తగాదాలు మరో తలనొప్పికి కారణమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్‌ నేతలు డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు.. బరిలో నిలిచే అభ్యర్థులపై ప్రభావం చూపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నియోజకవర్గా ల విషయంలో ఒక వర్గం నేతలు బలోపేతం కా కుండా.. వేరే వర్గం పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలు పోవడంతో... మిగతా నియోజకవర్గాల విషయంలో పీటముడి నెలకొంది. వీటిలో అయిదు స్థానాల నుంచి సిట్టింగ్‌ అభ్యర్థులే ఉండడంతో మరేం చేసే పరిస్థితి లేదు. ఇలా ఏడు స్థానాలు పోగా మిగతా స్థానాల విషయంలో చిక్కుముడులు ఎదురైనట్లు చెబుతున్నారు. అందులో భాగంగా మూడు స్థానాలను పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. 


ప్రత్యేకంగా చర్చించిన రాహుల్‌ 
టికెట్ల కేటాయింపులో వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ ఢిల్లీలో ప్రత్యేకంగా చర్చించారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరుకు సంబంధించి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో... ఈ చర్చలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో ప్యారాచూట్‌(అసెంబ్లీ రద్దు తర్వాత పార్టీలో చేరిన) నేతలకు టికెట్లు కేటాయించొద్దని రాహుల్‌గాంధీ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలు ప్రస్తావనకు    వచ్చినట్లు    సమాచారం. అయితే  ఈ   రెండు చోట్ల కూడా బరిలో నిలిచే నేతలు కుంభం శివకుమార్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డికి సర్వేల్లో మంచి మార్కులు వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు జాబితాలో నాగం కు స్థానం దక్కగా నారాయణపేట స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడం గమనార్హం.


అభ్యర్థులు వీరే..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీడీపీకి మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలను కేటాయించారు. ఆయా స్థానాల్లో ఎర్రశేఖర్, కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక గద్వాల నుంచి డీకే.అరుణ, వనపర్తి నుంచి చిన్నారెడ్డి, కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి, అలంపూర్‌ నుంచి సంపత్‌కుమార్, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి సిట్టింగ్‌లు కావడంతో వారికే మళ్లీ అవకాశం దక్కింది. ఇంకా జడ్చర్ల నుంచి మల్లు రవి, అచ్చంపేట నుంచి వంశీకృష్ణతో పాటు నాగర్‌కర్నూల్‌ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. కాగా, ఇవన్నీ పోను మూడు స్థానాలైన దేవరకద్ర, నారాయణపేట, కొల్లాపూర్‌ స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. ఇక్కడ పోటీ ఆశావహులు ఎక్కువగా ఉండడంతో రెండో విడతలో పేర్లు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement