మళ్లీ తెరపైకి రమేశ్బాబు పౌరసత్వ వివాదం
కరీంనగర్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం కేసు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జర్మనీ పౌరసత్వం కలిగిన రమేశ్ బాబుపై గతంలోనే ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీనిపై సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. మరోసారి వేములవాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో, తాజాగా ఈ కేసు తిరగతోడడానికి కాంగ్రెస్ సన్నద్దమవుతోంది.
డీసీసీ కార్యాలయంలో వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్తో సమావేశమయ్యారు. రమేశ్ బాబు పౌరసత్వంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రమేశ్ బాబును అనర్హుడిగా ప్రకటించేందుకు కృషి చేయాలని, వేములవాడలో ఉప ఎన్నికను అనివార్యం చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి రమేశ్ బాబు పౌరసత్వం కేసు మరోసారి తెరపైకి వస్తుండడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.