గవర్నర్ ప్రసంగం అనంతరం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి. చిత్రంలో గండ్ర, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం బహిరంగ సభ స్పీచ్‌లా ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని, గతంలో చెప్పిన విషయాలే ఇప్పుడు చెప్పారని విమర్శించారు. 2014లో ప్రకటించిన, ప్రారంభించిన పథకాలను ఎప్పుడు పూర్తి చేస్తారో, ప్రస్తుత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పట్నుంచి ప్రారంభిస్తారో చెప్పలేదన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగుల గురించి వాస్తవాలు చెబితే సంతోషించేవారమని భట్టి అన్నారు. పింఛన్లు, నిరుద్యోగ భృతిల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగం సాగిందని చెప్పారు. తనను సీఎల్పీ నాయకునిగా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో పాటు టీపీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరిని కలుపుకుని సమష్టిగా ముందుకెళ్తామన్నారు.
ఆ విషయాలు చెబితే బాగుండేది: షబ్బీర్
ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ స్పీచ్‌ను గవర్నర్ కాపీ కొట్టి ఉభయసభలనుద్దేశించి చదివారని షబ్బీర్ అలీ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం కాపీ పేస్ట్‌లా సాగిందని, రైతు రుణమాఫీ, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారో చెబితే బాగుండేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పదవీ విరమణ వయసు పెంపుపై స్పష్టత లేదని, ముస్లిం రిజర్వేషన్లపై కూడా అలాగే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
అప్పటి హామీలే ఇప్పుడు ప్రస్తావించారు: శ్రీధర్ బాబు
2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకిచ్చిన హామీలనే గవర్నర్ ఇప్పుడు ప్రస్తావించారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌పై గవర్నర్ అబద్ధాలు చదివారని, దేశంలో మిగులు విద్యుత్ ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. కాంగ్రెస్ అమలు చేసిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని, అలా కాకుండా గత ప్రభుత్వాలు తప్పు చేశాయనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీపై స్పష్టత లేద న్నారు. రుణమాఫీ ఏకకాలంలో చేస్తా రో లేదో చెప్పాలన్నారు. రైతుబంధు పథకం కింద ఇంకా చాలా మంది రైతులకు డబ్బులు అందలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎల్పీ రాష్ట్ర ప్రజల గొంతుక..
అసెంబ్లీలో సీఎల్పీ రాష్ట్ర ప్రజల గొంతుక అవుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా పనిచేస్తామని భట్టి చెప్పారు. సభ హుందాగా, ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుందని ఆశిస్తున్నామని, ప్రతిపక్షం బలంగా ఉండాలని పాలకులు కోరుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోతారంటూ అధికార టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతోందని, టీఆర్‌ఎస్ ఆకర్‡్షకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగరని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment