
‘చే’జారినట్టేనా?
జిల్లా పరిషత్ పీఠంపై కాంగ్రెస్ ఆశలు వదులుకున్నట్టే. అత్యధిక స్థానాలు గెలుచుకున్నా... అర్థ, అంగబలం ప్రదర్శించలేక చతికిలపడింది.
జెడ్పీ పీఠంపై ఆశలు వదులుకుంటున్న కాంగ్రెస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ పీఠంపై కాంగ్రెస్ ఆశలు వదులుకున్నట్టే. అత్యధిక స్థానాలు గెలుచుకున్నా... అర్థ, అంగబలం ప్రదర్శించలేక చతికిలపడింది. జిల్లా పరిషత్‌లో 33 జెడ్పీటీసీలకు 14 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మేజిక్‌ఫిగర్‌కు సరిపడా మరో ముగ్గురు సభ్యుల మద్దతు కూడగడితే జెడ్పీ కుర్చీ కైవసం చేసుకునే అవకాశ ముంది. ఈ క్రమంలో సొంత పార్టీ సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శిబిరాన్ని కూడా నిర్వహించింది. టీఆర్‌ఎస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తాము కూడా సహకరిస్తామని టీడీపీ సంకేతాలిచ్చింది. ఏడుగురు సభ్యులున్న టీడీపీ మద్దతు ఇస్తే.. జిల్లా పరిషత్‌ను దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావించింది.
ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు వేర్వేరు చోట్ల క్యాంపులు కూడా ఏర్పాటు చేశాయి. అయితే, కాంగ్రెస్ నేతల్లో కొరవడిన సమన్వయం క్యాంపుల నిర్వహణపై ప్రభావం చూపింది. చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. క్యాంపుల నిర్వహణ తడిసిమోపెడు కావడంతో శిబిరంపై కాంగ్రెస్ చేతులెత్తేసింది. మరోవైపు నలుగురు సభ్యుల పక్కచూపులు, మరికొందరు కూడా గులాబీ గూటికి చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం కావడం ఆ పార్టీని నైరాశ్యంలోకి నెట్టేసింది.
జిల్లా పరిషత్ గద్దెను ఆశిస్తున్న నవాబ్‌పేట జెడ్పీటీసీ యాదవరెడ్డి కూడా ఖర్చు విషయంలో వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. సరిపడా బలం లేకపోవడం, సొంత పార్టీ సభ్యులే కోరికల చిట్టా విప్పుతుండడంతో నేతలు సందిగ్ధంలో పడ్డారు. 12మంది సభ్యులు కలిగి ఉన్న టీఆర్‌ఎస్ కూడా.. కాంగ్రెస్‌లోని లుకలుకలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ప్యాకేజీలు, నజరానాలు ఎరవేయడం ద్వారా సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ‘మంత్రాంగం’ నడుపుతోంది. దీనికి తోడు అధ్యక్ష పదవిని ఆశిస్తున్న యాలాల జెడ్పీటీసీ సభ్యురాలు సునీత భర్త మహేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో టీఆర్‌ఎస్ శిబిరంలో రెట్టింపు ఉత్సాహం కనబడుతోంది. సునీతకు మద్దతు ఇవ్వడం ద్వారా భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న ఇతర పార్టీల సభ్యులు కూడా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపేందుకు కారణమవుతోంది.
హస్తవ్యస్తం..!
సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్ సార్వత్రిక ఫలితాలతో నీరుగారింది. సాధారణ ఎన్నికలకంటే ముందు జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ ఆశాజనక ఫలితాలు సాధించినప్పటికీ, పార్టీ సీనియర్లలో నెలకొన్న గ్రూపు తగాదాలు జిల్లా పరిషత్ ఎన్నికలపై కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ యాదవరెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదట్నుంచి విభేదిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేకపోవడం, క్యాంపుల నిర్వహణలో సామర్థ్యం లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వానికి సబిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సరూర్‌నగర్ జెడ్పీటీసీ అభ్యర్థిగా మల్‌రెడ్డి రాంరెడ్డిని బరిలో దించి.. చివరి నిమిషంలో విత్‌డ్రా చేయించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడం.. వైరివర్గంతో కోరి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని సబిత మెట్టు దిగారు. అధిష్టానం పెద్దలు కూడా జోక్యం చేసుకోవడంతో అయిష్టంగానే యాదవరెడ్డి అభ్యర్థిత్వానికి ఓకే చెప్పారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాలే వచ్చినా.. నిర్దేశిత సంఖ్యాబలానికి మూడు సీట్లు తగ్గాయి.
ఈ క్రమంలోనే క్యాంపుల నిర్వహణ బాధ్యతను యాదవరెడ్డికి అప్పగించారు. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడమే కాకుండా.. సొంత పార్టీ సభ్యులు గోడదూకకుండా జాగ్రత్తపడాలని, మద్దతిచ్చే ఇతర పార్టీ సభ్యులను కూడా సంతృప్తి పరచాలని హితబోధ చేశారు. కొన్ని రోజులు శిబిరాన్ని బాగానే పర్యవేక్షించినప్పటికీ, ఇటీవల కొందరు సభ్యులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడం.. క్యాంపు నిర్వహణ ఆర్థిక ఇబ్బందులు తెస్తుండడంతో యాదవరెడ్డి ఆశలు వదులుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ వ్యవహారశైలిపై టీడీపీ మండిపడుతోంది.
టీఆర్‌ఎస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ‘స్నేహ హస్తం’ అందిస్తామని స్పష్టం చేసినా.. కాంగ్రెస్ నాయకత్వం అందిపుచ్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేసు నుంచి కాంగ్రెస్ వైదొలిగితే.. తాము పోటీలో ఉంటామని కూడా సెలవిస్తోంది. ఖర్చుకు కూడా వెనుకాడబోమని, ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
జానా, చిన్నాలకు బాధ్యతలు!
జెడ్పీ, ఎంపీపీల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అగ్రనేతలను రంగంలోకి దించింది. మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డిలకు రంగారెడ్డి జిల్లా బాధ్యతలను అప్పగించింది. స్పష్టమైన మెజార్టీ రానప్పటికీ, గెలిచే స్థాయిలో సభ్యుల మద్దతు ఉన్నందున.. జిల్లా పరిషత్ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ పరంగా వ్యూహరచన చేసేందుకు ఇరువురు అగ్రనేతలపై జిల్లా బాధ్యతలు మోపింది.