సీఎం తీరును ఎండగట్టగలిగాం
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతృప్తి
సీఎల్పీ నేత తీరుపై కొందరు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: సభలో సీఎం కేసీఆర్‌పై, ప్రభుత్వంపై దాడి చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఒకింత సంతృప్తిగా ఉన్నారు. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో తమ ఆందోళనకు ఫలితం దక్కిందన్న అభిప్రాయంలో వారు ఉన్నారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టామని.. వాస్తవాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకు పోగలిగామని వారు పేర్కొంటున్నారు. శాసనసభ సమావేశాల్లో తమ వాయిదా తీర్మానంపై చర్చకు అవకాశం దొరక్కపోయినా.. విషయంపైకి బాగానే దృష్టి మరల్చామని, గవర్నర్ ఫిర్యాదు కూడా చేసినందువల్ల దీనిని ఇంతటితో వదిలేద్దామని నిర్ణయానికి వచ్చారు. ‘ఎలాగూ సీఎం కేసీఆర్ తీరును ఎక్స్‌పోజ్ చేశాం. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసి.. ప్రజా సమస్యలపై పట్టుబడతాం. ప్రభుత్వంపై దాడిలో వెనక్కి తగ్గేది లేదు..’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే బుధవారం పెన్షన్ల అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ సోమవారం వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్.. మంగళవారం కూడా దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టింది. మూడు సార్లు సభను వాయిదా వేసిన స్పీకర్.. అనంతరం 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవానికి పరిస్థితిని వివరించేందుకు కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ఉదయం 9.30 గంటలకే స్పీకర్‌తో భేటీ అయి, చర్చకు అవకాశమివ్వాలని కోరారు. అయినా అవకాశం రాకపోగా.. ఒక రోజు సస్పెండ్ అయ్యారు. కానీ పార్టీ సభ్యులందరిదీ ఒక దారి.. నాయకుడిది మరో దారిలా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది.
పట్టు వదిలితే ఎలా?
సభలో మంగళవారం కూడా వాయిదా తీర్మానంపై పట్టుబట్టాలనే విషయంలో కాంగ్రెస్ సభ్యుల మధ్య కొంత చర్చ జరిగినట్లు సమాచారం. సభ ఆరంభం కాగానే సీఎల్పీ నేత జానారెడ్డి, ఉప నేత జీవన్‌రెడ్డి మధ్య ఇదే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒకింత దూకుడుగా జీవన్‌రెడ్డి పోడియం వద్దకు వెళ్లడం, ఆయనను మిగతా ఎమ్మెల్యేలు అనుసరించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం జానారెడ్డి చాంబర్‌లో వీరంతా సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి? ఏయే అంశాలను ప్రస్తావించాలో మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత సీఎంపై దాడి కంటే, ప్రభుత్వంపై విమర్శలు చేసిన జానారెడ్డి ఎక్క డా వాయిదా తీర్మానంలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించకపోవడంతో... కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గొడవంతా ఎందుకన్న ధోరణిలో తమ నేత ఉన్నారని అభిప్రాయపడ్డారు. అయితే 14 మంది కాంగ్రెస్ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసినప్పుడు... ప్రతిపక్ష నేతగా ‘ప్రొటెస్టు’ తెలిపే అవకాశం ఉన్నా జానారెడ్డి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తమ సభ్యులతో పాటే బయటకు వచ్చేశారు. ‘ఆయన కనీసం నిరసన తెలిపి ఉండాల్సింది..’ అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
కలసిరాని సీఎల్పీ నేత!
సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో పదమూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. సుమారు అరగంట పాటు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కూడా జానారెడ్డి సీఎల్పీ కార్యాలయంలో కూర్చున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడడానికి కూడా రాలేదు. దాంతో డిప్యూటీ నేత జీవన్‌రెడ్డి మాట్లాడారు.