
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిర్వహించనున్న సన్‌బర్న్ పార్టీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సన్‌బర్న్ పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ , లాండ్ ఆర్డర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 లోగా వీడియో రికార్డులను సమర్పించాలని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ 30 కి వాయిదా వేసింది.నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత డ్రగ్స్, మద్యానికి బానిసలవుతున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్యం సరఫరా చేసే కార్యక్రమానికి మైనర్లను అనుమతించడం చట్ట విరుద్దమన్నారు. సన్ బర్న్‌పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
వాడివేడిగా వాదనలు
సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతివ్వడంపై దాఖలైన పిటిషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్‌లో మైనర్ల ప్రవేశానికి అనుమతి ఇవ్వటంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. అయితే, సన్‌బర్న్ ఈవెంట్‌కు షరతులతో కూడిన అనుమతులిచ్చామని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. ఆ షరతులతో కూడిన అనుమతి పత‍్రం చూపించాలని న్యాయమూర్తి కోరగా ప్రభుత్వ న్యాయవాది చూపించలేకపోయారు. మైనర్లకు ఎంట్రీ టికెట్లు విక్రయించి ఈవెంట్‌కు రాకుండా ఎలా ఆపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి వాదనలు వినిపించేందుకు మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేసింది.
స్టేడియం వద్ద భారీగా బందోబస్తు
గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సన్‌బర్న్ ఈవెంట్ షో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ షోను అడ్డుకుంటారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంత్ అక్క బ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఈవెంట్ షోకు అనుమతినివ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంను తాగి ఊగడానికి ఇస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈవెంట్ షోను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు మందుస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment