జిల్లాలో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?!  | The Congress, Which Has Been Defeated in the Assembly Elections, Has Been Working for the Glory of Parliament | Sakshi
Sakshi News home page

జిల్లాలో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?! 

Published Mon, Apr 1 2019 10:50 AM | Last Updated on Mon, Apr 1 2019 10:50 AM

The Congress, Which Has Been Defeated in the Assembly Elections, Has Been Working for the Glory of Parliament - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ పోరులో పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించింది. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, మాజీలు అధికార టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లినా.. పదేళ్ల క్రితం నాటి ఓటు బ్యాంకును నమ్ముకొని అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు.

రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం లభిస్తుం దేమోనన్న అంచనాలతో అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లోని ఫలితాలను లెక్కలోకి తీసుకోకుండా దేశంలో ప్రధాని ఎవరనే అంశం ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం సాగించేలా వ్యూహాలు సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటేయడం వల్ల ఉపయోగం లేదని.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారనే స్లోగన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. అదే సమయంలో పలుచబడ్డ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు. 

జీవన్‌రెడ్డి గెలుపుతో ఉత్సాహం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి భారీ ఆధిక్యతతో తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించిన విషయం విదితమే. ఇది ఆ పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుచుకుంది. అయితే మూడు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని కాంగ్రెస్‌ పా ర్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత కారణంగానే జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ విజయం సాధ్యమైందని, ఇవే ఫలి తాలు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని పొన్నం ప్రభాకర్‌ చెబుతున్నారు. అయితే విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రమే పాల్గొనే ఈ ఎన్నికలకు.. సాధారణ ఎన్నికలకు మధ్య తేడా చాలా ఉంటుందనే విషయం ఆయనకు తెలిసినా, జీవన్‌రెడ్డి గెలుపును ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. జీవన్‌రెడ్డి కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి కూడా కావడంతో పొన్నం ప్రభాకర్‌ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు.

కాగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ పార్టీని వీడడం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. మిగతా నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఎంత మేర ప్రభాకర్‌కు సహకరిస్తారనేది కూడా వేచిచూడాలి. చాలా నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు ఇంకా జనజీవన స్రవంతిలోకి రాకపోవడం కొంత ఇబ్బందికరమైన అంశంగా మారింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పార్టీ నాయకులను సమన్వయం చేసే బాధ్యతను జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం భుజాన వేసుకున్నారు. 

స్థానికతే ‘పెద్ద’ సమస్య
పెద్దపల్లి నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనకూల వాతావరణం ఉన్నప్పటికీ, అభ్యర్థి స్థానికత పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ జిల్లాతో సంబంధంలేని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన ఆగం చంద్రశేఖర్‌ను బరిలో దింపా రు. పార్టీలో పలువురు నాయకులకు చంద్రÔశేఖర్‌ పోటీ చేయడం నచ్చడం లేదు. ధర్మపురి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోగా, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తనకు పెద్దపల్లి టికెట్‌ రాకపోవడంపై ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు.

వీరి తోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థుల నుంచి తగిన సహకారం అందడం లేదు. అయి తే చంద్రశేఖర్‌ తనకున్న పరిచయాలతో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ నాయకులను కలుపుకుపోయే పనిలో పడ్డా రు.  అదే సమయంలో టీఆర్‌ఎస్‌ కూడా మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ను కాదని చెన్నూరులో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొర్లకుంట వెంకటేశ్‌ నేతను నిలబెట్టింది. ఈయన కూడా ప్రజలకు కొత్త వ్యక్తే. ఈ నేపథ్యంలో మారి న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనుకూలం అవుతుం దని పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌ భావిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలోని మంథనిలో కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘన విజయం సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న శ్రీధర్‌బాబు ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రామగుండంలో టీఆర్‌ఎస్‌ ఓడిపోయి ఇండిపెండెంట్‌ గెలిచినా అది వ్యక్తిగత అభిమానంతోనే చెబుతారు. దీంతో ఈసారి రామగుండం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది అంతుపట్టని అంశంగా మారింది. పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లిల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతోనే గెలవగా, ఈసారి ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. 

వివేక్‌ మద్దతు ఇస్తే అనుకూలం
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వెంకటస్వామి(కాకా) నాలుగు సార్లు ఎంపీగా గెలవగా, ఆయన కుమారుడు వివేక్‌ 2009లో ఎంపీగా గెలిచారు. ఈనేపథ్యంలో కాకా కుటుంబానికి వీర విధేయ అభిమానులు నియోజకవర్గంలో ఉన్నారు. ఆయనకు టీఆర్‌ఎస్‌కు టికెట్‌ ఇవ్వకపోవడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇప్పటి వరకు వివేక్‌ పార్టీకి రాజీనామా చేయకపోగా.. ఏ పార్టీలో చేరుతారనే విషయాన్నీ ప్రకటించలేదు.

బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్న ఆయన బీజేపీ టికెట్‌ ఇస్తే వేరే రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఆయన కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే భారీగా ఓట్లు పోలవుతాయని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ను గెలిపించుకునే పనిలో నిమగ్నమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement