
వైద్య విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ పరమేష్
దూద్‌బౌలి: ధర్నాలో ఆయుర్వేద వైద్య విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పరమేశ్ అనే కానిస్టేబుల్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురువారం విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీకి చెందిన కె.పరమేశ్ 2014లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి దక్షిణ మండలంలోని చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం జరిగిన సంఘటన సోషల్ మీడియాతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యార్థినులు సైతం కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో వెంటనే స్పందించిన దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా విచారణ జరిపి ప్రాథమిక నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. డీసీపీ నివేదిక ఆధారంగా నగర పోలీసు కమిషనర్ పరమేశ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.