బోటులో కృష్ణానదిలో ప్రయాణిస్తున్న జనం
సాక్షి, నాగర్‌కర్నూల్: సోమశిల–సిద్దేశ్వరం వంతెన నిర్మాణంపై అడుగు ముందుకు పడడం లేదు. పదేళ్ల క్రితం అప్పటి సీఎం వైఎస్సార్ చేసిన శంకుస్థాపన చేయగా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2007లో మంచాల కట్ట వద్ద మరబోటు మునిగి 61మంది జలసమాధి అయిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వంతెన నిర్మించడంలో పాలకులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రతి రోజూ జిల్లాలోని కృష్ణానది తీర గ్రామాల నుంచి నిత్యం అవతలి ఒడ్డున ఉన్న రాయలసీమ ప్రాంత గ్రామాలకు పుట్టీలు, పడవల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే పుట్టీ నిర్వాహకులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ పెద్దగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గోధావరి ఘటనతోనైనా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోజూ వందల సంఖ్యలో రాకపోకలు
కృష్ణానదికి ఇవతలి వైపునాగర్‌కర్నూల్ జిల్లా అటువైపు కర్నూలు జిల్లా ఉన్నాయి. ఇరు జిల్లాల పరిధిలోని నదీతీర గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు బోటులో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ ప్రయాణిస్తుంటారు. జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతాల నుంచి బోటు, పుట్టి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు బోట్లు, పుట్టీలలో ప్రయాణిస్తూ ఉంటారు. అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడం, బోట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి.
పర్యవేక్షణ కరువు..
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 9గంటల నుంచి సాయంకాలం 5గంటల వరకు ఆయా ప్రాంతాల నుంచి బోట్లు రాకపోకలు సాగుతూనే ఉంటాయి. బోటు నిర్వాహకులు మాత్రం ప్రయాణికుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లైఫ్ జాకెట్లు కచ్చితంగా ప్రయాణికులకు ఇవ్వాల్సి ఉన్నా ఒక పర్యాటక బోటులో తప్పా, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే బోట్లలో ఇవ్వడం లేదు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కృష్ణానది ఉధృతంగా ప్రహిస్తున్న నేపథ్యంలో బోటు ప్రయాణం అంత సురక్షితం కాదు.
రోడ్డు మార్గంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాలకు వెళ్లాలంటే ఆరు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ మంది బోట్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగోటం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే బోటు ప్రయాణాలపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది తప్పా మిగతా రోజుల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ పెంచాలని, వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
2009లో శంకుస్థాపన
2007 జనవరి 18న కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నెహ్రూనగర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని సింగోటం లక్ష్మి నరసింహ్మాస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్న మరబోటు మంచాలకట్ట వద్ద నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 61మంది మృతి చెందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో పాటు రూ.149.40కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 2009 ఫిబ్రవరి 13న కొల్లాపూర్‌లో శంకుస్థాపన కూడా చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తర్వాత వచ్చి న పాలకులు బ్రిడ్జి నిర్మాణంపై పాలకులు పట్టించుకోలేదు. అయి తే గత నెల 29న పాలమూరు–రంగారెడ్డి ప నుల పరిశీలనకు కొల్లాపూర్‌కు వచ్చిన సీఎం కే సీఆర్ బ్రిడ్జి నిర్మానంపై మాట్లాడతారని స్థానిక ప్రజలు ఆశించినప్పటికీ ఆ ప్రస్తావనే తేలేదు.
వంతెన నిర్మించాలి
సోమశిలలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నదీ ప్రయాణాలు కూడా సులభతరంగా మారుతాయి. వంతెన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలి.
– లక్ష్మీనర్సింహ, సోమశిల
Comments
Please login to add a commentAdd a comment