సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసే నీటితో జరుగుతున్న విద్యుదుత్పత్తిపై మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వల పరిధిలోని విద్యుత్ కేంద్రాల ద్వారా తెలంగాణ అధికంగా నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై కృష్ణా బోర్డుకు కూడా ఫిర్యాదు చేసింది.
రెండేళ్ల కిందటి వివాదం..
వాస్తవానికి శ్రీశైలం విద్యుదుత్పత్తిపై 2015లోనే వివాదాలు తలెత్తాయి. దాంతో ఈ అంశంలో కల్పించుకున్న కృష్ణా బోర్డు.. ఆ విద్యుదుత్పత్తిలో ఇరు రాష్ట్రాలకు చెరి సగం సమాన వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. విద్యుత్ పంచుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయనందున.. ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నామని, ఆ ఏడాదికే ఇది పరిమితమవుతుందని పేర్కొంది. దీనిని భవిష్యత్తులో పరిగణించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
అయితే బోర్డు ఆదేశించినా కూడా ఏపీ 2015లో పలుమార్లు ఉల్లంఘనకు పాల్పడి ఎక్కువ నీటిని వినియోగించుకొని, ఎక్కువ విద్యుదుత్పత్తి చేసింది. తెలంగాణ దీనిపై అప్పట్లో బోర్డుకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడు సమాన నిష్పత్తిన విద్యుదుత్పత్తి చేయాలన్న నిబంధనేదీ అమల్లో లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వినియోగిస్తోంది.
మేమూ వినియోగించుకుంటాం
తెలంగాణ నీటి వినియోగాన్ని ఏపీ తప్పుపడుతోంది. కేవలం తాగు, సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసే సమయంలోనే విద్యుదుత్పత్తి చేయాలని.. కేవలం విద్యుత్ కోసమే నీటిని విడుదల చేయరాదని బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే తెలంగాణ 94.22 టీఎంసీలు విద్యుదుత్పత్తికి వినియోగించిందని, తాము కేవలం 42.19 టీఎంసీలే వినియోగించుకున్నామని పేర్కొంది.
గతంలోని ఒప్పందం మేరకు.. తమకు విద్యుత్ కేంద్రాల ద్వారా నీటి విడుదల, విద్యుదుత్పత్తిలో సమాన అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. తాము కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు విద్యుత్ కేంద్రాల ద్వారా నీటి వినియోగం అంశాన్ని ఈ నెల 4న జరిగే భేటీలో ఎజెండాగా చేర్చింది. ఆ భేటీలో దీనిపై స్పష్టత తీసుకురావాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment