
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న చర్యలను గవర్నర్‌కు సీఎం వివరించారు. రాష్ట్రంలో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు జరుగుతోందని, ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తోందని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు, వలస కార్మికులకు ఇబ్బంది కలగకుండా వారికి నగదు, బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. గత నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి తిరిగి వచ్చినవారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్ చేయడం దాదాపు పూర్తయిందని గవర్నర్‌కు తెలిపారు. కరోనా నిర్ధారిత, అనుమానిత కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను గవర్నర్‌కు వివరించారు. వైద్యులు కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని వ్యక్తిగత రక్షణ పరికరా (పీపీఈ)లను సమకూర్చిందన్నారు.
త్వరలో రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమావేశంలో వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.