విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బారికేడ్
సాక్షి, హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సంచరించిన ప్రాంతాలను గుర్తించిన అధికార యంత్రాంగం 26 మందిని కరీంనగర్‌లోని ఐసోలేషన్ కేంద్రానికి ఐదు రోజుల క్రితం తరలించగా, గురువారం 24 మందికి నెగెటివ్ రావడంతో హుజూరాబాద్‌కు తీసుకవచ్చారు. వీరు కుటుంబ సభ్యులతో సహా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. నెగెటివ్ రావడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. (కరోనా: అక్కడ తొలి మరణం )
లాక్‌డౌన్ పటిష్ట అమలుకు చర్యలు
ఒక్క హుజూరాబాద్ పట్టణంలోనే మూడు కేసులు నమోదైనా క్రమంలో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తుండగా, ఆ ఆంక్షలు బుధవారం రాత్రి నుంచి మరింత కఠినతరం చేశారు. కాకతీయ కాలనీ, విద్యానగర్, మార్కెట్ ఏరియా, మామిండ్లవాడ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. హుజూరాబాద్ పట్టణంలో సుమారుగా 11 వేల ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సంచరించిన ప్రాంతాలను గుర్తించి వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపుగా 1550 ఇళ్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ఇందులో విద్యానగర్, కాకతీయ కాలనీల్లోని 800, మార్కెట్ ఏరియాలో 350, మామిండ్లవాడలో 400 ఇళ్లను దిగ్బంధం చేసి ఆంక్షలు విధించారు. ఆ వార్డుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. (కరోనా: ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం)
ఇంటింటా సర్వే
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు అనే దానిపై అధికార యంత్రాంగం అప్రమత్తమై 26 మందిని గత ఐదు రోజుల క్రితం కరీంనగర్‌లోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అందులో 24 మందికి నెగెటివ్ రావడంతో హుజూరాబాద్‌కు గురువారం తిరిగి పంపించారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య బృందాలు అనుమానితంగా గుర్తించిన వార్డుల్లో ఇంటింటా సర్వేలు నిర్వహిస్తూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ కరోనా కట్టడికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్‌లోని పట్టణ వాసులు మరికొంత కాలం ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసిన వాడల్లోని ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. (భారత్ మేలు మరువలేమన్న ట్రంప్)
కరీంనగర్‌లో...
► కరోనా మొత్తం పాజిటివ్ : 18
► చికిత్స తర్వాత నెగెటివ్ : 11
► చికిత్స పొందుతున్న వారు : 07
► క్వారంటైన్ చేసిన వారు : 113
► క్వారంటైన్ పూర్తయిన వారు : 99
► ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నవారు : 16 మంది
► ప్రభుత్వాసుపత్రి క్వారంటైన్‌లో : 02
► శాతవాహన యూనివర్శిటీ క్వారంటైన్‌లో : 14
► చల్మెడ ఆసుపత్రి క్వారంటైన్‌లో : 00
► శాతవాహన క్వారంటైన్ ఇంచార్జి :
► డాక్టర్ పురుషోత్తం – 9246935364
► చల్మెడ ఆసుపత్రి క్వారంటైన్ ఇంచార్జి :
► డాక్టర్ రవీందర్‌రెడ్డి – 9849902496
► ప్రభుత్వాసుపత్రి క్వారంటైన్ ఇంచార్జి :
► డాక్టర్ రత్నమాల – 9849277260
Comments
Please login to add a commentAdd a comment