- నీటి సరఫరా నెట్‌వర్క్ ఖర్చు స్థానికులదే
- జలమండలి కొత్త నిర్ణయం
- మాదాపూర్‌తో శ్రీకారం
- 30:70 నిబంధనకు చెల్లు?
సాక్షి,సిటీబ్యూరో: శివారు వాసులపై జలమండలి మరో భారం మోపుతోంది. శివారు కాలనీలు, బస్తీల్లో మంచినీటి సరఫరా నెట్‌వర్క్ ఏర్పాటుకయ్యే మొత్తం వ్యయాన్ని ఇకపై స్థానికులే భరించాల్సి ఉంటుంది. దీనికి ముందుకొస్తేనే పైప్‌లైన్లు వేయాలని జలమండలి నిర్ణయించింది. గతంలో స్థానికులు 30 శాతం, జీహెచ్‌ఎంసీ 70 శాతం నిధులు వెచ్చిస్తే మంచినీటి సరఫరా నెట్‌వర్క్ ఏర్పాటుకు జలమండలి చర్యలు తీసుకునేది. కొత్త నిర్ణయంతో భారమంతా ప్రజల పైనే పడనుంది. తాజాగా మాదాపూర్‌లోని ఓ కాలనీలో 15 అపార్ట్‌మెంట్ బ్లాకులు ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీకి నీటి సౌకర్యానికి రూ.3 కోట్ల వ్యయాన్ని ఆ ఫ్లాట్లలో ఉండే వినియోగదారుల నుంచే వసూలు చేస్తోంది. కృష్ణా మూడో దశ ద్వారా నగరానికి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 385 మిలియన్ గ్యాలన్లకు అదనంగా త్వరలో మరో 45 ఎంజీడీల జలాలు నగరానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈనీటిని ఆయా ప్రాంతాలకు సరిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
నిబంధనకు చెల్లుచీటీ?
గతంలో శివారు కాలనీలు, బస్తీలకు మంచినీటి సరఫరా పైప్‌లైన్లు, చిన్న పరిమాణంలో ఉండే స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో జీహెచ్‌ఎంసీ 70 శాతం, స్థానికులు 30 శాతం నిధులు వెచ్చించేవారు. జీహెచ్‌ఎంసీ ఈ విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తూ తమ వాటా నిధులను విదల్చకపోవడంతో శేరిలింగంపల్లి, కాప్రా, అల్వాల్, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్ తదితర మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలు ఏళ్లుగా దాహార్తితో అలమటిస్తున్నాయి. మరోవైపు రూకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జలమండలి నెలవారీ ఆదాయం సుమారు రూ.92 కోట్లు విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న లోన్లకు సంబంధించిన వాయిదాలు చెల్లించేందుకే సరిపోతున్నాయి. నిధులు వెచ్చించే పరిస్థితి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని జలమండలి వర్గాలు వివరించాయి.
80 శాతం మంది ముందుకొస్తేనే...
ఏదేని ఒక కాలనీ, బస్తీ, అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో జలమండలి భారీ మంచినీటి పైప్‌లైన్ అందుబాటులో ఉండి.. అక్కడి నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలంటే స్థానికంగా 80 శాతం మంది జలమండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం వ్యయాన్ని అందరికీ సమానంగా పంచుతారన్నమాట. అంటే సుమారు రూ.కోటి వ్యయమయ్యే పనికి కావాల్సిన మొత్తాన్ని ఈ 80 శాతం మంది చెల్లించాలి. స్థానికంగా మొత్తం వంద శాతం మంది చార్జీలు చెల్లించే స్థితిలో ఉండరన్న దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా... నగరానికి అదనంగా రానున్న మూడోదశ నీటిని మార్కెటింగ్ చేసి.. తద్వారా బోర్డు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
నీరే బంగారం
Published Tue, May 26 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement