
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్‌కు వచ్చారు.