జగత్‌సింగ్ రూపొందించిన లిపి
ఇందల్‌వాయి : గిరిజన తెగలలో ఒకటైన లంబాడీలకు మాట్లాడటానికి భాషా ఉన్నా రాయడానికి సరైన లిపి లేదు. దీని పర్యావసనంగా లంబాడి భాషా, సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని భావించిన ఓ గిరిజన యువకుడు.. తమ భాష మీద ప్రేమ, తమ సం స్కృతిపై మమకారంతో ప్రత్యేక లిపి రూపొందించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆరు సంవత్సరాలు గా ఇతర భాషల లిపిలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అకుంఠిత దీక్షతో చివరకు ఎలాంటి లోపాలు లేని 50 అక్షరాలతో కూడిన లిపిని లంబాడి భాష కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశాడు.
అతడే ఇందల్‌వాయి మండలంలోని స్టేషన్ తండా గ్రామ పంచాయతీకి చెందిన జగత్ సింగ్ పవార్. డిగ్రీ వరకు చదువుకున్న జగత్‌సింగ్.. లిపి లేని ఎన్నో భాషలు అంతరించి పోతున్నాయని గుర్తించి, లంబాడి భాషా కూడా అలా అంతరించి పోకుండా కాపాడేందుకు పూనుకున్నాడు. తండ్రి నూర్‌సింగ్ పవార్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రత్యేక లిపిని తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు.
శోధించి.. సాధించి..
దేశంలో 10 శాతం జనాభా ఉన్న లంబాడీలకు ప్రత్యేక లిపి లేక ఇతర భాషలపై ఆధారపడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో లంబాడి భాషకు ప్రత్యేక లిపి అవసరమని జగత్‌సింగ్ లిపి రూపకల్పనకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం దేవనాగరి, హిందీ తదితర ప్రాచీన భాష ప్రావీణ్య పుస్తకాల నుంచి ఆధారాలు సేకరించాడు. అలాగే, భాషా పండితుల ఆత్మకథలను చదివి, పలువురు భాషా పండితుల సూచనలు తీసుకొని అహర్నిషలు శ్రమించి చివరికి ఇతర భాషాల లిపిలతో పోలిక లేని విధగా లంబాడి భాషా లిపికి రూపకల్పన చేశాడు.
13 అచ్చులు.. 37 హల్లులు..
జగత్‌సింగ్ రూపొందించిన లంబాడి భాష లిపిలో 13 అచ్చులు, 37 హల్లులు ఉన్నాయి. వీటికి వొత్తు లు కూడా ఉన్నాయని, వీటి ఆధారంగా మహాభారతంలోని కొన్ని శ్లోకాలు కూడా రాశానని జగత్ సింగ్ తెలిపాడు. ఈ లిపితో లంబాడి భాషలో మాట్లాడే ఏ పదాన్నైనా సులభంగా రాయవచ్చని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ లిపిని ప్రభుత్వం గుర్తించి, లిపిలో మరింత పరిపక్వత సాధించేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నాడు.
లంబాడ యువత ఈ లిపిని ఆదరించాలని, ఆసక్తి ఉన్న వారికి అవగాహన, శిక్షణ ఇస్తానంటున్నాడు జగత్‌సింగ్. ఈ లిపితో తమ భాషా, సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. లిపిపై ఆసక్తి ఉన్న వారు ఫోన్ నెం.83281 72129లో సంప్రదించాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment