‘ఆర్థిక లావాదేవీలు’ అదృశ్యం!  | Cyber criminals following the latest trends | Sakshi
Sakshi News home page

‘ఆర్థిక లావాదేవీలు’ అదృశ్యం! 

Published Wed, Jul 4 2018 1:26 AM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

Cyber criminals following the latest trends - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. ఓ నేరం చేసిన తర్వాత తాము చిక్కినా పర్వాలేదు కానీ డబ్బు మాత్రం చేతులు దాటకూడదనే లా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్థిక లావాదేవీల కోసం వెబ్‌సైట్లకు చెందిన గేట్‌వేలు వాడుతున్నారు. దీంతో బాధితులు పంపిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేలోపు ఆ మొత్తాన్ని మళ్లించేస్తున్నారు. ఈ సరికొత్త పంథా అనుసరించిన ఢిల్లీ క్రిమినల్స్‌.. నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.4.5 లక్షలు కాజేశారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు ప్రారంభించారు.  

అసలేం జరిగిందంటే... 
గౌలిపురకు చెందిన వ్యాపారి వికాస్‌ అగర్వాల్‌కు ఢిల్లీకి చెందిన ‘ఎక్స్‌ప్రెస్‌ టు కాట్‌’ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఇటీవల ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. తమ కంపెనీ నిర్వహించిన డ్రాలో వికాస్‌ ఫోన్‌కు బహుమతి వచ్చిందని, రూ.25 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.7,200కు అందిస్తున్నామని చెప్పి, తమ కంపెనీ వెబ్‌సైట్‌కు చెందిన ఓ లింకును పంపారు. అందులోకి ప్రవేశించిన వికాస్‌ డెబిట్‌కార్డు వివరాలతో పాటు ఓటీపీ సైతం ఎంటర్‌ చేయడంతో నగదు కట్‌ అయింది. కొన్ని రోజులు వేచి చూసినా తనకు టీవీ రాకపోవడంతో వికాస్‌ మళ్లీ వారిని సంప్రదించారు. దీంతో మీకు వచ్చిన బహుమతి నగదుగా మారిందని, రూ.లక్ష అందుకోవడానికి మరికొంత చెల్లించాలని చెప్పారు. ఇలా బహుమతి మొత్తంతో పాటు దాని కోసం చెల్లించాల్సిన డిపాజిట్‌ను పెంచుకుంటూ వెళ్లారు. మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాక మోసపోయిన విషయం తెలుసుకున్న వికాస్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ నగదు ఏ ఖాతాలోకి వెళ్లిందో తెలియలేదు.  

గేట్‌ వేలను ఆశ్రయిస్తున్న నేరగాళ్లు... 
సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేసిన వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేయడానికి తొలినాళ్లలో తమ బ్యాంకు ఖాతాల వివరాలే ఇచ్చేవారు. మూడునాలుగేళ్లుగా పేటీఎం సహా ఇతర యాప్స్‌ మార్గాలు ఎంచుకునేవారు. వాటిలోకే బాధితుల ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవారు. వీటిలో ఏ పంథా అనుసరించినా బాధితులు తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్నాయి. ఫలితంగా డబ్బు పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంలేదు. దీంతో తాజాగా సైబర్‌ నేరగాళ్లు పంథా మార్చారు. పేమెంట్‌ గేట్‌వేలను ఆశ్రయిస్తున్నారని వికాస్‌ అగర్వాల్‌ కేసు స్పష్టం చేస్తోంది.  

సమాచార సేకరణ ఆలస్యం 
వికాస్‌ అగర్వాల్‌ నుంచి డబ్బు వసూలు చేసిన ‘ఎక్స్‌ప్రెస్‌ టు కాట్‌’వెబ్‌సైట్‌ ‘పేయూ’గేట్‌ వేతో అనుసంధానించి ఉంది. సైబర్‌ నేరగాళ్లు పంపిన లింకు ద్వారా వికాస్‌ పే చేసిన మొత్తం ఈ గేట్‌ వే ద్వారా దానికి అనుసంధానించి ఉన్న బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వికాస్‌ ఫిర్యాదు చేసిన వెంటనే డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది తెలుసుకోవడం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సాధ్యం కాలేదు. దీనికోసం వారు తొలుత వికాస్‌ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంది. అందులో ఉన్న వివరాలను బట్టి పేయూ ఖాతాను గుర్తించి, దాని సమాచారం కోరుతూ నిర్వాహకులకు లేఖ రాయాలి. వారి నుంచి సమాధానం వచ్చే వరకు ఏ బ్యాంకు ఖాతాలోకి నగదు వెళ్లిందో గుర్తించడం సాధ్యం కాదు.

ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి ఆధారాలతో సదరు బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌ చేయించాలి. దీనికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లోపు సైబర్‌ నేరగాళ్లు తమ ఖాతాల్లో ఉన్న డబ్బు మరోచోటుకు మళ్లించడమో, ఖర్చు చేసేయడమో జరిగిపోతుంది. ఫలితంగా నేరగాళ్ళు చిక్కినప్పుటికీ డబ్బు రికవరీ మాత్రం అసాధ్యంగా మారుతుంది. ఈ తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వీటి నిరోధానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement