కేసీఆర్తోనే బంగారు తెలంగాణ
♦ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అనంతరం
♦ తొలిసారి జిల్లాకు.. డీఎస్‌కు ఘన స్వాగతం
♦ వందలాది వాహనాలతో భారీ ర్యాలీ
చంద్రశేఖర్‌కాలనీ : బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. చక్కటి ఆలోచనలతో ప్రణాళికబద్ధమైన విజన్‌తో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న సీఎం అడుగు జాడల్లో అందరం కలిసికట్టుగా నడిచి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి జిల్లాకు వచ్చిన డీఎస్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ‘కేసీఆర్‌కు షుక్రీయా ర్యాలీ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం, జిల్లా కేంద్రంలో సన్మాన సభను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 8.40 గంటలకు బయల్దేరిన డీఎస్‌కు మార్గమధ్యలో మేడ్చల్, తూప్రాన్, రామాయంపేట్, కామారెడ్డి, డిచ్‌పల్లిలలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని ఇందల్‌వాయి గేట్ వద్దకు చేరుకున్న డీఎస్‌కు జిల్లా నాయకులు, అనుచరులు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
అనంతరం అక్కడి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్ యువసేన కార్యకర్తలు వందలాది బైకులు, కార్లతో మాధవనగర్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్‌కు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సోమయ్య నేతృత్వంలో ఆలయ అర్చకులు పూర్ణాకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన డీఎస్ అనంతరం.. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి మొదలైన భారీ ర్యాలీ బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్‌నగర్, పులాంగ్ చౌరస్తా, ఆర్‌ఆర్ చౌరస్తా, బడాబజార్, ఆజాంరోడ్డు, నెహ్రూ పార్కు చౌరస్తా, గాంధీగంజ్ చౌరస్తా మీదుగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియానికి చేరుకుంది.
ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో డీఎస్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీపరంగా తలనొప్పి వ్యవహారాలు ఉండవద్దని, ఐక్యంగా ముందుకు సాగుదామని సూచించారు. విభేదాలు, రాగ ద్వేషాలు పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరం కలసి కట్టుగా జిల్లాను రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై అపారమైన విశ్వాసం ఉండటంతోనే ఆయనకు ప్రభుత్వాన్ని అప్పగించారని తెలిపారు. గొప్ప చరిత్ర గల కాంగ్రెస్‌లో హేమాహేమీలు, అనేక సేవలు చేసిన వారూ ఎన్నెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి వదిలివేశారన్నారు. అలాంటి వారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు నిర్మిస్తే డిజైన్ల మార్పు పేరోత రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
చకచక ప్రాజెక్టుల నిర్మాణం..
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన భగీరథ పథకాలతో ప్రాజెక్టుల నిర్మాణాలను చకచక చేపడుతోందని డీఎస్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉందామన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ నాయకుడు, జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న డీఎస్‌ను సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా చేశారన్నారు. విభేదాలు, కలహాలకు తావివ్వకుండా విశ్వాసంతో, అంకితభావంతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దామన్నారు. రెండు సార్లు పీసీసీగా పని చేసిన డీఎస్ సమర్థుడైన, ఆలోచనపరడైన నాయకుడని, హుందాతనం, సహృదయం గల వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వీజీ గౌడ్, జెడ్పీ చెర్మైన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, ఐడీసీఎస్ మాజీ చెర్మైన్ మునిపల్లి సాయరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నేతలు రాంకిషన్‌రావు, ఆదెప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతా తానై వ్యవహరించిన సంజయ్..
‘కేసీఆర్‌కు షుక్రీయా ర్యాలీ’ పేరుతో నిర్వహించిన స్వాగత ఏర్పాట్లను డీఎస్ తనయుడు సంజయ్ అంతా తానై నడిపించారు. మూడ్రోజుల నుంచి ఆయన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేశారు.