
కన్నీటిని ఆపేదెవరు?
సాక్షి, గుంటూరు : గుంటూరు-విజయవాడ సరిహద్దులో కృష్ణానది తీరం వెంబడి వున్న ఇసుక తిన్నెల్లో కూర్చోవాలనీ, ఊసులాడుకోవాలనీ ని త్యం పలు జంటలు, మహిళలు,విద్యార్థినులు వస్తుంటారు. వీరిలో కొందరు కృష్ణానదిలో మృతదేహాలుగా తేలుతున్నారు. తాడేపల్లి మండలం సీతానగరం, కనకదుర్గమ్మ వారథి, ఉండవల్లి ఇసుక రేవు, కొండవీటివాగు, బకింగ్ హామ్ కెనాల్ వంటి ప్రాంతాల వద్ద పలువురు నదిలో దూకి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏడాదిలో సుమారు 150 మంది ఇక్కడ ప్రా ణాలు కోల్పోయారు.
కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయారు. నదిలోపడి చనిపోయిన 26 మంది ఆచూకీని పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు గుంటూరు వైపు ప్రకాశం బ్యారేజీ వద్ద నిఘా ఉంచడం గానీ, రక్షణ చర్యలు చేపట్టటం గానీ చేయడం లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేయ టం పోలీసులకు పరిపాటిగా మారిందంటున్నారు.
►ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీస్ అవుట్‌పోస్టు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయంటున్నారు.
►సీతానగరం ఇసుక తిన్నెల వద్దకు వచ్చిన మహిళలు, విద్యార్థినులపై ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించడం, అత్యాచారయత్నాలకు పాల్పడడం వంటి సంఘటనలు గతంలో జరిగినప్పటికీ పోలీసులు తీసుకున్న చర్యలు నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు.
సూసైడ్ జోన్‌గా మారిన కృష్ణాతీరం
►తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణా తీరం సూసైడ్ జోన్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఇసుక తిన్నెల వద్ద తిరుగాడే అనేక మంది తెల్లవారుజాముకల్లా శవాలై కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడేవారిలో అధిక శాతం మంది విద్యార్థినులు, మహిళలే ఉండటం గమనించదగ్గ విషయం.
►ఇక్కడ ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసుల పర్యవేక్షణ లోపంతో వీటిని మాత్రం అరికట్టలేకపోతున్నారు.
►ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం వారి తల్లిదండ్రులకు కడుపుకోతగా మారింది.
►మూడు రోజుల కిందట కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు కృష్ణానదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే.
►శనివారం రాత్రి నది ఒడ్డున విద్యార్థినుల బ్యాగులు లభ్యమైనప్పటికీ అందులో ఉన్న వివరాల ప్రకారం వారి తల్లిదండ్రులకు గానీ, కళాశాల యాజమాన్యానికి గానీ విషయం తెలియపరచడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరించారనే విమర్శలు వచ్చాయి.
►ఆదివారం ఉదయం మృతదేహాలు తేలిన తరువాత సమాచారం అందించారు. కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు రాత్రంతా నిద్రలేకుండా విలపిస్తుంటే పోలీసుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ తెలియపరచకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
►నదిలో పడి మృతి చెందిన విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యకు గురయ్యారా? అన్న విషయాన్ని తేల్చడంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.