
దొంగే.. దొంగ అన్నట్టుంది!
పొన్నాలపై డిప్యూటీ సీఎం రాజయ్య ధ్వజం
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పదేళ్ల అస్తవ్యస్త పాలనే కారణమని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు దేశంలో, రాష్ట్రంలో ఆ పార్టీని తిరస్కరించారన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో పొన్నాల తీరు ‘దొంగే.. దొంగ.. దొంగ... అన్నట్టుగా ఉందని విమర్శించారు.
సచివాలయంలో శనివారం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య 54 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి తెలంగాణలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేకపోయారన్నారు. రాబోయే ఐదేళ్లలో లక్ష ఎకరాల సాగుభూమి కొనుగోలు చేసి దళితులకు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదన్నారు. కేసీఆర్ పాలన చూసి ప్రధాని నరేంద్రమోడీ కూడా మంత్రముగ్ధులయ్యారని, ఏ మంత్రదండం ఉందోనని ఆరా తీస్తున్నారని చెప్పారు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయన్నారు.