
సాక్షి, నర్సంపేట రూరల్: రెండు తరగతుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ రాళ్ల దాడికి దారితీసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులు భోజనశాలకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులు మధ్య మాట మాట పెరిగడంతో ఉపాధ్యాయులు నచ్చజెప్పి పంపించారు. ఒక వర్గం విద్యార్థులు భోజనశాల నుంచి బయటకు వస్తూ మరోవర్గం వారిని దుర్భాషలాడటంతో రాత్రి మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ క్యాంపస్‌లోకి పంపించి తాళాలు వేశారు. కాగా, బయటనే ఉన్న 9, 10 తరగతి విద్యార్థులు ఇంటర్ విద్యార్థుల గదులపై రాళ్ల వర్షం కురిపించారు.
దీంతో రాళ్లు తగిలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వచ్చి రాళ్లు రువ్విన విద్యార్థులను చెదరగొట్టారు. గాయపడిన విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సంపేట ఎస్సై నవీన్‌కుమార్ ఈ ఘటనపై మాట్లాడుతూ, ఘర్షణ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.