
సీఎల్పీ రేసులో డీకే అరుణ?
కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతగా మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
- తనవంతు ప్రయత్నంలో చిన్నారెడ్డి
- నేడు రాజధానిలో ఎమ్మెల్యేల భేటీ, దిగ్విజయ్‌సింగ్ రాక
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతగా మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిపై ఆ పార్టీలో తీవ్రపో టీ నెలకొన్న విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన మరో నేత, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా సీఎల్పీ పదవిపై ఆశలు పెంచుకుని పావులు కదుపుతున్నట్లు సమాచారం. తెలంగాణలోని నల్గొండ జిల్లాతో సమానంగా పాలమూరులోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ పదవికి జిల్లాకు చెందిన వారినే ఎంపికచేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత ఎంపికపై జిల్లా కాంగ్రెస్‌వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. యువనేత రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా మహిళకు అవకాశం కల్పిస్తామని హామీఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనూ జిల్లాకు చెందిన మాజీమంత్రి డీకే అరుణ పేరు అప్పట్లో తెరపైకి రావడంతో పాటు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ కూడా సాగింది.
ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. కాబట్టి అరుణకు ఆ అవకాశమే లేకుండా పోయింది. అయితే సీఎల్పీ పదవినైనా దక్కించుకోవాలన్న ధృడసంకల్పంతో ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులను కలిసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, అనుచరవర్గంతో ఢిల్లీకి వెళ్లిన డీకే అరుణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను వివరిస్తూనే పనిలో పనిగా పరోక్షంగా సీఎల్పీ పదవికి తన పేరును పరిశీలించాల్సిందిగా విన్నవించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని సోనియాతో పాటు యువనేత రాహుల్, నాయకులు దిగ్విజయ్‌సింగ్, జనార్ధన్ ద్వివేది తదితరుల దృష్టి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నేడు జరుగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభ పక్ష నేతగా తన పేరు పరిశీలనకు రాగలదన్న ఆశతో ఆమె ఉన్నట్లు అనుచరవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా సీఎల్పీ పదవిపై ఆశలు పెంచుకుని తనకున్న పలుకుబడితో పావులు కదుపుతున్నట్లు సమాచారం.