సాక్షి, హైదరాబాద్: ఆధార్ సంఖ్య ఇవ్వని రైతుల వ్యవసాయ కనెక్షన్లు తొలగించవద్దని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. సరఫరా నిలిపివేస్తే తమ దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. అన్ని రకాల సమాచారం కోసమే కనెక్షన్లకు ఆధార్ లింకేజీ పెట్టామని, ఇది కేవలం వ్యవసాయ వినియోగదారులకే పరిమితం కాదని స్పష్టం చేశారు. దీనికి గడువు విధించడం సరికాదని, ఇలా చేసినందుకు డిస్కమ్‌ల అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తామంటుంటే, ఆపివేసే అధికారం తమకెక్కడిదన్నారు.
‘ఆధార్ లేకుంటే ఉచిత విద్యుత్ కట్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితమైన నేపథ్యంలో అజయ్ జైన్ డిస్కమ్‌ల సీఎండీలతో చర్చించారు. అనంతరం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. రైతుల వ్యవసాయ కనెక్షన్లు తొలగించొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఆధార్‌కు, ఉచిత విద్యుత్‌కు ఎంతమాత్రం సంబంధం ఉండబోదని అన్నారు. అయినప్పటికీ రైతులు ఆధార్ నంబర్లు అందజేయాలని కోరారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను శాస్త్రీయంగా లెక్కగట్టాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు.
ఆధార్ కోసం వేధించకండి: అజయ్ జైన్
Published Fri, Nov 21 2014 2:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement