
ముగిసిన ‘డ్రగ్స్’ విచారణ
చివరి రోజు నందును ప్రశ్నించిన సిట్
కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నలు
ఈవెంట్ మేనేజర్‌గానే తెలుసునన్న నటుడు
చార్జిషీట్ వేసే యత్నాల్లో అధికారులు
సాక్షి, హైదరాబాద్
డ్రగ్స్ కేసులో తొలి జాబితాలో ఉన్న సినీ ప్రముఖుల విచారణ ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం వర్ధమాన నటుడు ఆనంద్ కృష్ణ అలియాస్ నందు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని తన ఇంటి నుంచి తండ్రి, మేనమామతో కలసి బయలుదేరిన నందు.. అక్కడి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ఉదయం 10 గంటల సమయంలో ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఆవరణలో ఉన్న బాలాత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి మొక్కుకొని విచారణ కోసం లోనికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముగిసింది.
కెల్విన్‌తో సంబంధమేంటి?
కెల్విన్ ఫోన్ కాల్‌డేటాలో నందు నంబర్ ఉండటంపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. వీకెండ్ పార్టీలకు ఎక్కువగా వెళ్తుంటారా? అని సిట్ ప్రశ్నించగా తనకు అలవాటు లేదని, కెల్విన్ కాల్‌డేటాలో నంబర్ ఎలా వచ్చిందో కూడా తెలియదని అధికారులకు వివరించినట్టు సమాచారం. వాట్సాప్‌లో కెల్విన్‌తో చాటింగ్‌పై ప్రశ్నించగా.. ఈవెంట్ మేనేజర్ కావడం వల్ల తన నంబర్ ఇచ్చి ఉంటానని, అంతకు మించి డ్రగ్స్ వ్యవహారంలో అతడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలిసింది. కావాలంటే తన రక్త నమూనాలు, వెంట్రుకలు, గోర్ల శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేయాలని నందు కోరినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం శాంపిల్స్ అవసరం లేదని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ వాడతారో తెలుసా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడిప్పుడే పెద్దపెద్ద బ్యానర్లలో నటిస్తున్నా. అలాంటి వివరాలేవీ నాకు తెలియదు’ అని నందు చెప్పినట్టు సమాచారం.
తదుపరి చర్యలేంటి?
డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖుల విచారణను సిట్ మంగళవారంతో ముగించింది. తర్వాత చర్యలేంటి? ఇంకెవరికైనా నోటీసులిస్తారా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను విచారిస్తారా అన్న ప్రశ్నలకు సిట్ అధికారులు సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతానికి ఇంతటితో విచారణ ముగిసిందని, చార్జిషీట్ దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నామని సిట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మీడియా పాయింట్ ఎత్తివేత డ్రగ్స్ కేసు ప్రారంభమైన నాటి నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియా హడావుడి ఉండేది. మంగళవారం చివరిరోజు విచారణ ముగిసిన వెంటనే ఎక్సైజ్ అధికారులు మీడియా పాయింట్‌ను ఎత్తేశారు. మీడియా ఎంట్రీ ఉన్న గేటుకు తాళం వేశారు.