
డీఎస్పీల బదిలీ జిల్లాలో
పోలీసుశాఖలో సమూల మార్పులు జరిగాయి. ఒకేసారి భారీగా డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి.
* 14 మందికి స్థానచలనం
* నలుగురికి ఇక్కడే పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీసుశాఖలో సమూల మార్పులు జరిగాయి. ఒకేసారి భారీగా డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో ప్రస్తుతం చేస్తున్న 14 మందికి బదిలీ అయ్యింది. వీరిలో నలుగురు డీఎస్పీలకు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఐదుగురు డీఎస్పీలను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. మామూనూరు డీఎస్పీ సురేశ్‌కుమార్‌కు కీలకమైన సుల్తాన్‌బజార్ ఏసీపీ పోస్టు ఇచ్చారు. ఐదుగురు డీఎస్పీలను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఐదుగురు డీఎస్పీలు బదిలీపై కొత్తగా మన జిల్లాకు వచ్చారు.
రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అనుర గా శర్మ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీఎస్పీ బదిలీలు జరుగుతాయనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ఆధారంగా ఎక్కువ బదిలీలు జరిగినట్లు స్పష్టమవుతోంది.
ముఖ్యమైన పోస్టింగ్‌ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇతర ఒత్తిడులను పట్టించుకోలేదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలే డీఐజీ, ఇద్దరు ఎస్పీల బదిలీలు జరిగాయి. తాజాగా డీఎస్పీల బదిలీ ప్రక్రియ ముగిసింది. గత నెలలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేసినా రాజకీయ కారణాలతో వాటిని నిలిపివేశారు. వారంలోపే ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.