కరోనాతో కుదేల్‌..! | Due To Corona Virus Effect Various Sectors Are In Serious Crisis | Sakshi
Sakshi News home page

కరోనాతో కుదేల్‌..!

Published Sun, Apr 19 2020 1:12 AM | Last Updated on Sun, Apr 19 2020 2:04 PM

Due To Corona Virus Effect Various Sectors Are In Serious Crisis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా దెబ్బకు వివిధ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వ్యవసాయ, పౌల్ట్రీ, ఫార్మా, సిమెంట్, గ్రానైట్, విద్యుత్‌ తదితర రంగాలు లాక్‌డౌన్‌ కారణంగా కుదేలవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు మొదలు పారిశ్రామికవేత్తల వరకు అందరినీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ను ఎత్తేసినా దీని ప్రభావం మరికొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ముడి రసాయనాల రవాణాకు ఆటంకం..
భారతీయ ఔషధ తయారీ పరిశ్రమలు ఉపయోగించే ముడి రసాయనాలు సుమారు 70 శాతం మేర చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో నౌకాశ్రయాల్లో తనిఖీలు ఆలస్యంగా పూర్తవుతున్నాయి. సముద్ర రవాణా అత్యధికంగా యూరోపియన్‌ దేశాల ఆధిపత్యంలో ఉండటంతో ముడి పదార్థాల రవాణాపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముడి సరుకుల ధర, రవాణా వ్యయం పెరగడం, కార్మికుల హాజరు తగ్గడంతో ఔషధాల ధరల్లో పెరుగుదల తప్పదని ఫార్మారంగ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా క్లోరోక్విన్‌ఫాస్ఫేట్, మాంటేల్‌ కాస్ట్‌ ఎల్‌సీ, పారా మోనోఫినాల్‌ (పీఏపీ), మెటాఫోర్నియా (డీసీడీఏ), విటమిన్‌ సీ (2కేజీఏ) ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముడి పదార్థాల ధరలు 30 శాతం మేర పెరిగినట్లు బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త

సంక్షోభంలో గ్రానైట్‌ పరిశ్రమ..
ఆర్థిక మందగమనంతో ఇప్పటికే దెబ్బతిన్న గ్రానైట్‌ పరిశ్రమ కరోనాతో పూర్తిగా స్తంభించి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో క్వారీయింగ్‌లో వెలికితీసిన బ్లాక్‌లు ఎక్కువగా చైనాకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం రవాణా స్తంభించడంతో బ్లాక్‌లను తరలించే పరిస్థితి లేదు. పైగా ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకుకు సంబంధించి రూ. 5 వేల కోట్ల మేర విదేశీ మార్కెట్లో చిక్కుకుపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గ్రానైట్‌ రంగానికి దక్షిణాదిలో ప్రధాన ఉత్పత్తి, ఎగుమతిదారులుగా ఉన్న తెలంగాణ, ఏపీ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఈ రంగంలో సుమారు 25 లక్షల మంది పనిచేస్తుండగా రాష్ట్రంలోనే సుమారు 6 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ ఇతర రూపాల్లో నష్టం జరగుతుండగా, తాము బ్యాంకు రుణాలు, కిస్తీల చెల్లింపు, వేతనాలు, డెడ్‌ రెంట్‌ చెల్లింపు వంటి అనేక అంశాల్లో ఇబ్బందులు పడుతున్నట్లు దక్షిణాది గ్రానైట్‌ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు వి.సుదర్శన్‌రావు, గణేశ్, సీఎస్‌ రావు వెల్లడించారు. గ్రానైట్‌ రంగంపై ఆధారపడిన లాజిస్టిక్స్‌ రంగం కూడా కరోనా మూలంగా తీవ్రంగా దెబ్బతింది.

సిమెంట్‌ పరిశ్రమల్లో నిలిచిన ఉత్పత్తి..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని సిమెంట్‌ పరిశ్రమలన్నీ మార్చి 23 నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి నిలిపివేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తయారయ్యే సిమెంట్‌ను దేశీయ మార్కెట్‌లో 98 శాతం వినియోగిస్తుండగా నిర్మాణ రంగం స్తంభించడం సిమెంట్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిశ్రమల వద్ద నిల్వల్లో ఒకటీ అరా శాతం మాత్రమే అత్యవసర ప్రభుత్వ పనుల కోసం రవాణా చేస్తున్నారు. ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా ఉత్పత్తి సామర్థ్యంలో 30 శాతానికి మించి సిమెంట్‌ తయారీ సాధ్యం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రిటైల్‌ రంగం గాడిన పడితేనే సిమెంట్‌ తయారీ రంగం తిరిగి çపూర్తిస్థాయిలో పట్టాలెక్కుతుందని భారతీ సిమెంట్స్‌ మార్కెటింగ్‌ డైరక్టర్‌ రవీందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ట్రాన్స్‌ఫార్మర్లకు ‘కోర్‌ప్లేట్‌’కొరత..
విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ‘కోర్‌ప్లేట్‌’ను చైనా, జపాన్, కొరియా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. కరోనా మూలంగా ఈ ముడి పదార్థం రవాణా నిలిచిపోవడం ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో 10, 25, 160 కిలోవాట్ల సామర్థ్యంగల ట్రాన్స్‌ఫార్మర్ల కొరతకు దారితీస్తోంది. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌) వద్ద ప్రస్తుతం 160 కేవీ సామర్థ్యంగల ట్రాన్స్‌ఫార్మర్లు 300 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు సుమారు 2 వేలు కావాల్సి ఉండగా కొరత మూలంగా అత్యవసర ప్రాంతాల్లోనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. 

వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం..
తెలంగాణలో రబీ వరి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా బత్తాయి, ద్రాక్ష, పూల సాగు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్‌ లేక పండ్లు, పూలను నేలపాలు చేసేందుకు కూడా రైతులు వెనుకాడటం లేదు. లాక్‌డౌన్‌ మూలంగా మార్కెటింగ్, రవాణా వసతి లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తామనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. 

కోళ్ల పరిశ్రమకు అపార నష్టం
చికెన్‌ తింటే కరోనా సోకుతుందనే ప్రచారం పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌కు ముందే చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగానికి రూ. 20 వేల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా సుమారు రూ. 2 వేల కోట్లు ఉంటుందని పౌల్ట్రీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కరోనా ప్రభావానికి ముందు దేశంలో రోజూ సగటున 25 వేల కోట్ల గుడ్ల ఉత్పత్తి జరగ్గా రెండు రాష్ట్రాల్లో 3.75 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం దేశంలో గుడ్ల ఉత్పత్తి 17 కోట్లకు పడిపోగా తెలంగాణలో 2.20 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా 1.20 కోట్ల కోళ్లు (ఒక్కో కోడి సగటు బరువు రెండు కిలోలు) అమ్ముడవుతుండగా తెలంగాణలో 7.50 లక్షల కోళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. గతంతో పోలిస్తే చికెన్‌ వినియోగం 40 శాతం పడిపోయింది. రెండు నెలలుగా ఒక్కో గుడ్డుపై రూపాయిన్నర చొప్పున నష్టం వస్తోందని ‘నెక్‌’బిజినెస్‌ మేనేజర్‌ సంజీవ్‌ చింతావర్‌ వెల్లడించారు. రవాణా నిలిచిపోవడం, ఔషధాల లభ్యత, కోళ్ల ఎదుగుదల లేమి పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశవ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడిన 60 లక్షల మంది ఉపాధితోపాటు చిన్న, సన్నకారు రైతులు, దాణా తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement