
దుర్గం చెరువుపై జరుగుతున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో జీహెచ్‌ఎంసీ దుర్గం చెరువు వద్ద చేపట్టిన కేబుల్‌స్టే బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే అక్టోబర్‌లోగా పూర్తికానున్నాయి. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచ వ్యాప్తంగా మూడవ పెద్ద కేబుల్ బ్రిడ్జిగా చరిత్రకెక్కనుంది. ఇప్పటివరకు గుజరాత్ బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జే అతి పెద్దది. జపాన్‌లో మరో రెండు పెద్ద కేబుల్ బ్రిడ్జిలున్నాయి. బ్రిడ్జి పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజ నీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో 754.38 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు 60% పూర్తయ్యాయి. వంతెన సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
కేబుల్ బ్రిడ్జి ఎత్తు- 20 మీటర్లు
పొడవు- 754.38 మీటర్లు
నిర్మాణ వ్యయం- 184కోట్లు
ఎక్స్‌ట్రా డోస్డ్ సాంకేతికత..
ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఎక్స్‌ట్రా డోస్డ్ సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో వంతెన ఎత్తు తగ్గడంతో పాటు చెరువుకు ఇరువైపులా, చెరువు మధ్యలో బ్రిడ్జికి పిల్లర్‌ను నిర్మించకుండానే పూర్తి చేయనున్నారు. సంప్రదాయ సాంకేతిక విధానంలో నిర్మిస్తే 75 మీటర్ల ఎత్తు వరకు పిల్లర్లను నిర్మించడంతో పాటు చెరువు మధ్యలో అంతే ఎత్తులో సపోర్టింగ్‌గా మరో పిల్లర్‌ను నిర్మించాల్సి వచ్చేది. దీంతో ఎంతో ఎత్తుపై ఈ కేబుల్ బ్రిడ్జి మహానగరాల ప్రమాణాలకు విరుద్ధంగా ఉండేది. ఎక్స్‌ట్రా డోస్డ్ సాంకేతిక విధానంతో 75 మీటర్లకు బదులుగా 57 మీటర్ల ఎత్తులోనే పిల్లర్లను నిర్మిస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పద్ధతితో కేబుల్ బ్రిడ్జి నిర్మించడం ప్రపంచంలో ఇది మూడోది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాదా పూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గ డంతో పాటు హైదరాబాద్‌లో తొలి హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందనుంది. దీంతో మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి అవసరమైన స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి తెప్పించారు. ట్రాక్ బీమ్ ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తుతో ఉం డే ప్రధాన బ్రిడ్జికి సంబంధించిన ప్రీ కాస్టింగ్ నిర్మాణ పనులు కొండాపూర్‌లో జరుగుతున్నాయి.
సిగ్నల్ ఫ్రీ కారిడార్..
నగరంలో వివిధ ఐటీ పరిశ్రమలు హైటెక్ సిటీ, మాదాపూర్ వైపున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ మంది నివాసాలు పంజాగుట్ట, ఎల్‌బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్లేందుకు ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి ఖాజాగూడ వరకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ప్రయాణం సాఫీగా పలు ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో కేబీఆర్ జంక్షన్ చుట్టూ ఫ్లై ఓవర్లు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్, ఇనార్బిట్ మాల్ నుంచి ఖాజాగూడ టన్నెల్‌తో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కూడా ఉంది.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రయోజనాలు..
హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఇది ప్రత్యేక ఐకాన్‌గా నిలుస్తుంది.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36, మాదాపూర్‌పై ట్రాఫిక్ తగ్గుతుంది.
జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కి.మీ. మేర దూరం తగ్గనుంది.
నమూనా చిత్రం
రూ.2,988 కోట్లతో పనులు: మేయర్
దుర్గం చెరువు బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ ఫ్లై ఓవర్ పనుల్ని గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనతో కలసి మాట్లాడుతూ... సిగ్నల్ ఫ్రీ పనుల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.2,988 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని, వచ్చే మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే రూ.65.82 కోట్లతో చేపట్టిన రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. రూ.150 కోట్లతో చేపట్టిన రోడ్ నం.45 ఎలివేటెడ్ కారిడార్‌ను వచ్చే సెప్టెంబర్‌లో... రూ.333.55 కోట్లతో నిర్మిస్తున్న షేక్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్, రూ. 263 కోట్లతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్, అంబర్‌పేట చే నంబర్ వద్ద రూ. 270 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్లు డిసెంబర్‌లోగా పూర్తికానున్నాయన్నారు. ఓవైసీ హాస్పిటల్ నుంచి బహదూర్‌పురా మార్గంలో రూ.132 కోట్ల వ్యయంతో చేపట్టిన కారిడార్ నిర్మాణం సెప్టెంబర్‌లోగా పూర్తి కానుందన్నారు. ఇంకా రూ. 2,353 కోట్ల ఖర్చుతో ఏడు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల పనులకు టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉందని వెల్లడించారు. రూ.1,186 కోట్ల వ్యయంతో ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ క్రాస్‌రోడ్ ఫ్లైఓవర్లు అనుమతి దశలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, సూపరింటిండింగ్ ఇంజనీర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment