పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల సందడి
అల్గునూర్(మానకొండూర్) : మొదటిసారి ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల కోసం తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి, వాగేశ్వరి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించిన అగ్రికల్చర్ పరీక్షకు 3,502 మందికి 3296 మంది హాజరయ్యారు. ఉదయం వాగేశ్వరి కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో 750 మందికి 710 మంది, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో 352 మందికి 328 మంది, జ్యోతిష్మతి కళాశాలలో 150 మందికి 135 మంది, శ్రీచైతన్య ఇంజినీరింగ్–1లో 350 మందికి 331 మంది, శ్రీచైతన్య–2లో 149 మందికి 144 మంది విద్యార్థులు హాజరయ్యారు.
మధ్యాహ్నం వాగేశ్వరి అయాన్ డిజిటల్ సెంటర్‌లో 750 మందికి 712 మంది, ఇంజినీరింగ్ కళాశాలలో 350 మందికి 333, జ్యోతిష్మతిలో 150 మందికి 138, శ్రీచైతన్య–1లో 349 మందికి 325, శ్రీచైతన్య–2లో 150 మందికి 137 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వాహకులు తెలిపారు. కాగా ఉదయం వాగేశ్వరి కేంద్రానికి వేములవాడకు చెందిన తిప్పారపు వెన్నెల 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన కింద అధికారులు ఆమెను అనుమతించలేదు.
బయోమెట్రిక్‌తో హాజరు నమోదు
విద్యార్థులందరికీ బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేశారు. నూతన విధానంలో నిర్వహిస్తున్న పరీక్షతో విద్యార్థులు మొదట కొంత ఆందోళన చెందినా..ఆ తర్వాత అంతా సర్దుకుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను రెండు గంటల ముందే అనుమతించడంతో పరీక్షలు ప్రశాంతంగా రాశారు. హాల్‌టికెట్లపై గెజిటెడ్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల ఇన్‌చార్జిలే సంతకాలు చేయించి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ
ఎంసెట్ పరీక్ష కేంద్రాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గతంలో అల్గునూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కారణంగా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు ఇన్‌చార్జిగా మానకొండూర్ సీఐ కోటేశ్వర్‌ను నియమించగా, ఎస్సైలు నరేశ్‌రెడ్డి, పల్లె నర్సింగ్ పర్యవేక్షించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాగేశ్వరి కళాశాల సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి టెంట్లు కూడా ఏర్పాటు చేయించి తాగునీటి వసతి కల్పించారు.
పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment