► ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
► ఇంజనీరింగ్ విభాగం టాప్–10 బాలురే.. అగ్రికల్చర్‌లోనూ వారిదే హవా
► ఇంజనీరింగ్‌లో 74.75 శాతం, అగ్రికల్చర్–ఫార్మసీలో 86.49 శాతం అర్హులు
► రేపటి నుంచి ఓఎంఆర్ షీట్ల డౌన్‌లోడ్.. 27 వరకు ‘చాలెంజ్’కు అవకాశం
► ఈనెల 28 నుంచి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్
► వచ్చే నెల రెండో వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్
► టీ ఎంసెట్‌లో ప్రతిభ చూపిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎంసెట్ –2017లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం టాప్–10 ర్యాంకులన్నీ బాలురకే లభించగా.. అగ్రికల్చర్, ఫార్మసీలోనూ టాప్–10లో ఏడు ర్యాంకులను వారే సాధించారు. మొత్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 74.75 శాతం, అగ్రికల్చర్–ఫార్మసీలో 86.49 శాతం మంది అర్హత సాధించారు. ఇక రెండు కేటగిరీల్లోనూ టాప్–10 ర్యాంకుల్లో సగం వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించారు. ఈనెల 12న నిర్వహించిన ఎంసెట్–2017 ర్యాంకులను సోమవారం జేఎన్టీయూహెచ్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ‘కీ’లో ఎలాంటి తప్పులూ లేవని.. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి ఈ విషయాన్ని తేల్చిందని చెప్పారు. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకులను ఖరారు చేసినట్లు తెలిపారు.
ఇంటర్ ఫెయిలై..
టీ ఎంసెట్‌కు మొత్తంగా 2,20,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,41,136 మంది దరఖాస్తు చేసుకోగా.. 93.46 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్–ఫార్మసీ కోసం 79,033 మంది దరఖాస్తు చేసుకోగా.. 92.99 శాతం హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,11,092 మంది (74.75 శాతం), అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో 70,721 మంది (86.49 శాతం) అర్హత సాధించారు. ఇక దాదాపు 22 వేల మంది విద్యార్థులు ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్‌లో ఫెయిలైన కారణంగా ర్యాంకులు పొందలేకపోయారు. మరో 3,222 మంది విద్యార్థుల ఇంటర్ మార్కుల వివరాలు అందజేయకపోవడంతో వారికి ర్యాంకులను ప్రకటించలేదు.
టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే!
ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల జయంత్ హర్ష మొదటి ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లారి రామ్‌ప్రసాద్ 2వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కడిమిశెట్టి వీఎన్‌వీఎస్ నేస్తంరెడ్డి మొదటి ర్యాంకు, ప్రకాశం జిల్లాకు చెందిన గొల్లమూడి ప్రదీత్ సుందర్ 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
ఒక్కరికీ ‘ఫుల్’మార్కులు రాలేదు
160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో ఒక్క విద్యార్థికి కూడా పూర్తిగా 160 మార్కులు లభించలేదు. ఇంజనీరింగ్‌లో టాప్ మార్కులు 156కాగా.. ఇద్దరు విద్యార్థులే ఈ స్థాయి మార్కులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో గరిష్ట మార్కులైన 153 మార్కులను ఇద్దరు విద్యార్థులు సాధించారు.
గణితంలో ఐదుగురికి 80/80
ఇంజనీరింగ్ విభాగంలోని గణితం సబ్జెక్టులో 80 మార్కులకుగాను పూర్తిగా 80 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఫిజిక్స్‌లోనూ ఐదుగురు విద్యార్థులు 40 మార్కులకు 40 మార్కులను పొందారు. కెమిస్ట్రీలో 40 మార్కులకుగాను గరిష్టంగా 39 మార్కులను నలుగురు విద్యార్థులు సాధించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలోని బయాలజీలో 80కి 80 మార్కులు పదిమంది విద్యార్థులకు లభించాయి. ఫిజిక్స్‌లో 40కి గాను గరిష్టంగా 38 మార్కులను ముగ్గురు విద్యార్థులు సాధించారు. కెమిస్ట్రీలోనూ గరిష్టంగా 38 మార్కులను ఒకే విద్యార్థి సాధించారు.
అభ్యంతరాలుంటే ‘ఛాలెంజ్’!
విద్యార్థులు తమ ఓఎంఆర్ జవాబు పత్రాలను ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు ఎంసెట్ వెబ్‌సైట్ ( ్ఛ్చఝఛ్ఛ్టి. ్టటఛిజ్ఛి. ్చఛి. జీn) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. వాటిలో ఏమైనా తేడాలు, అభ్యంతరాలుంటే ఛాలెంజ్ చేసేందుకు అవకాశం కల్పించారు. సాధారణ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు చెల్లించి ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఛాలెంజ్ చేయవచ్చు. ఈ నెల 28వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ర్యాంకులు అటూ ఇటూ!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు చాలా మంది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎంసెట్ పరీక్షలు రాశారు. వారిలో కొందరు తెలంగాణలో టాప్ ర్యాంకుల్లో నిలవగా, ఏపీలో తక్కువ ర్యాంకు లభించింది. మరికొందరికి ఏపీలో ఎక్కువ ర్యాంకు రాగా.. తెలంగాణలో తక్కువ ర్యాంకు వచ్చింది. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి టీఎంసెట్‌లో ఐదో ర్యాంకు వచ్చింది. అదే టీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 4వ ర్యాంకు లభించడం గమనార్హం. అగ్రికల్చర్–ఫార్మసీలోనూ ఇలాగే ఉంది. టీ ఎంసెట్ అగ్రికల్చర్–ఫార్మసీలో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థి.. ఏపీ ఎంసెట్‌లో టాప్–10 ర్యాంకుల్లో లేకపోవడం గమనార్హం. ఇలా అనేక మంది విద్యార్థుల ర్యాంకులు తారుమారు అయ్యాయి.