
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వ పనికి ‘కోడ్’ అడ్డం పడుతోంది. దీనివల్లే జీహెచ్‌ఎంసీలో ప్రతి గురువారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశాలు సైతం నిర్వహించడం లేదు. మూడు మాసాలకోసారి నిర్వహించాల్సిన సాధారణ సర్వసభ్య సమావేశాలను సైతం మరచిపోయారు. అలాగే నడుస్తున్న ఆర్థిక సంవత్సర(2018–19) బడ్జెట్ సవరణపైన, కొత్త బడ్జెట్(2019–20) రూపకల్పనపైన అధికారులు సంశయంలో పడ్డారు. ఎన్నికల కోడ్ లేనట్లయితే అక్టోబర్–నవంబర్‌లో నడుస్తున్న బడ్జెట్‌కు సవరణలు చేయడంతో పాటు రాబోయే ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్‌ను రూపొందించేవారు.
నిర్ణీత క్యాలెండర్ మేరకు అక్టోబర్ నుంచి కొత్త బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించి నవంబర్ 10వ తేదీ నాటికి స్టాండింగ్ కమిటీ ఆమోదానికి పంపేవారు. డిసెంబర్ 10వ తేదీలోగా జనరల్ బాడీ సమావేశం ముందుంచేవారు. ఎన్నికల కోడ్ వీటికి వర్తిస్తుందో, లేదో సంశయాలుండటంతో ఈ అంశాల గురించి ప్రస్తావిస్తూ స్పష్టత నివ్వాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. అందుకు బదులిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ చట్టబద్ధమైన కార్యక్రమాలను, నిర్ణీత వ్యవధుల్లో నిర్వహించాల్సిన సమావేశాలను ఆపాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, సదరు సమావేశాల్లో ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోరాదని, ఎలాంటి ప్రకటనలు కూడా చేయరాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. దినవారీ కార్యక్రమాల నిర్వహణ, అత్యవసర అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చునని స్పష్టం చేసినట్టు సమాచారం.
క్యాలెండర్ మేరకు బడ్జెట్ ప్రక్రియ ఇలా..
♦ నవంబర్ 10వ తేదీలోగా స్టాండింగ్ కమిటీ ముందుకు ముసాయిదా బడ్జెట్
♦ డిసెంబర్ 10వ తేదీలోగా జనరల్‌బాడీ సమావేశం ముందుకు
♦ ఫిబ్రవరి 20 లోగా పాలకమండలి ఆమోదం
♦ అనంతరం సమాచార నిమిత్తం ప్రభుత్వానికి నివేదన
Comments
Please login to add a commentAdd a comment