రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని కోరుతున్నారు.
ఎస్కలేషన్ కమిటీకి తేల్చి చెప్పిన బిల్డర్స్ అసోసియేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని కోరుతున్న కాం ట్రాక్టర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవో 13ను అమలు పరుస్తూనే దానిలో మార్పులు చేయాలని కోరుతున్నారు.ఇదే సమయంలో ఏపీలో చిన్నపాటి మార్పులు చేస్తూ కొత్తగా ఇచ్చిన జీవో 22ను అమలు చేసినా తమకు ప్రయోజనం చేకూర్చలేదని స్పష్టం చేస్తున్నారు.
ఎస్కలేషన్‌పై గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో 13 అమలుతో ఎదురయ్యే పరిణామాల అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరాములు చైర్మన్‌గా, ఇరిగేషన్ ఈఎన్‌సీ మెంబర్ కన్వీనర్‌గా, మరో ఇద్దరు రిటైర్డ్ ఇంజనీర్లు ఎస్.చంద్రమౌళి, జి.ప్రభాకర్‌లు సభ్యులుగా ఉన్న కమిటీ మంగళవారం బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైంది. జీవో 13 అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం పనులు చేయలేమని ప్రతినిధులు స్పష్టం చేశారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ పనులు చేయడం కాంట్రాక్టర్లకు భారంగా మారిందని కమిటీ దృష్టికి తెచ్చారు.
జీవో 13లో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను అమలు చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇక సబ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ తరఫున కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ జీవో 13ను అమలు చేసినా గౌరవెల్లి, తోటపల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదని, అక్కడ 60(సి) కింద సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని కోరినట్లుగా సమాచారం.