- అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ‘ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం)’లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఈజీఎంఎం శిక్షణ కార్యక్రమాల రూపకల్పనపై శనివారం ఆయన ఆ విభాగం ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈజీఎంఎం శిక్షణ కేంద్రాల పనితీరును మెరుగు పర్చేందుకు వివిధ రంగాల్లో పేరుపొందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశిం చారు. నిరుద్యోగ యువతకు అందించే శిక్షణలో, వృత్తి నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కు అధిక ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఈజీఎంఎంను ఉపాధి, వృత్తినైపుణ్య వనరుల సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించిందని పేర్కొన్నారు.
పరిశ్రమలకు అనుసంధానం: ఈజీఎంఎం శిక్షణ కేంద్రాలను పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేసి, శిక్షణ పొందే యువత కు ఉద్యోగావకాశాలు మెరుగయ్యేలా ప్రణాళికలు రూపొందిం చాలన్నారు. శిక్షణ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పేరున్న సంస్థలకే అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈజీఎంఎం కార్యక్రమాల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగింపు..
ఎం ప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆయా ఉద్యోగాల్లో మరో ఏడాదిపాటు కొనసాగించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి వారి వివరాలను ఈజీఎంఎంకు అందించే జాబ్ రిసోర్స్ పర్సన్ల(జెఆర్‌పీ)ను కూడా కొనసాగిస్తామన్నారు. ఉద్యోగ భద్రత గురించి ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఈజీఎంఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి మురళీధర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.