
సాక్షి, హైదరాబాద్ : సిరిసిల్లలో ఇటీవల జరిగిన ఓ సభలో ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వరాలపై ఎన్నికల కమీషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం లేఖ రాసింది. సిరిసిల్లలో జరిగిన సభలో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఫుల్‌గా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రస్తుతం ఉన్న జీఓను సవరిస్తామని వారికి తెలంగాణ సర్కారు పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు, పలువురు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, ఏఐసీసీ నేత మధుయాష్కీ, నిరంజన్‌లు రజత్ కుమార్‌ను కోరారు.