సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కాలుష్య నియంత్రణకు విద్యుత్‌తో నడిచే ఈ బ్యాటరీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఆరు నెలల క్రితమే ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న మెట్రో లగ్జరీ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు అద్దె ప్రాతిపదికన వీటిని నడిపేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకురాగా టెండర్లు ఖరారయ్యాయి.. బస్సులూ వచ్చేశాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులూ ‘గ్రీన్’సిగ్నల్ ఇచ్చేశారు. బస్సులతో పాటు చార్జింగ్ పాయింట్లు, శిక్షణ పొందిన డ్రైవర్లూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆర్టీసీ, నిర్వహణ సంస్థలకు మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదకరపోవడంతో బ్యాటరీ బస్సులు రోడ్డెక్కడం లేదు.
ప్రయోగాత్మకంగా పరిశీలన...
నగరంలో వాహన కాలుష్యాన్ని నియంత్రించి, పర్యావరణ ప్రమాణాలను పెంపొందించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను విరివిగా అందుబాటులోకి తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎల్పీజీ, సీఎన్‌జీ లాంటి సహజ ఇంధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో ఆర్టీసీ సీఎన్‌జీ బస్సులను ఉపసంహరించుకుంది. గతంలో 350 సీఎన్‌జీ బస్సులకు ప్రతిపాదనలు రూపొందించగా.. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి తగినంత ఇంధనం సరఫరా కాకపోవడంతో ప్రస్తుతం 100 కూడా రోడ్డెక్కలేకపోతున్నాయి. ఈ క్రమంలో బ్యాటరీ బస్సుల ప్రస్తావన ముందుకొచ్చింది. ‘గోల్డ్ టెక్’ సంస్థ వీటిని ఆర్టీసీకి పరిచయం చేయగా, సికింద్రాబాద్–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మధ్య ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించారు. అన్ని విధాలా అనుకూలమని భావించడంతోనే వీటిని ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. టెండర్లు ఆహ్వానించగా గోల్డ్‌టెక్ సంస్థ ఒలెక్ట్రా పేరుతో సిద్ధార్థ ఇన్ఫోటెక్ సంస్థతో కన్సార్టియంగా ఏర్పడి టెండర్లు దాఖలు చేసింది. ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ కన్సార్టియానికి అవకాశం దక్కింది.
మరో సంస్థ రాకతో...
టెండర్లు దక్కించుకున్న సిద్ధార్థ ఇన్ఫోటెక్ కన్సార్టియం... ఆర్టీసీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 40బస్సులను నడిపేందుకు కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం 22బస్సులు సిద్ధంగా ఉండగా, మరో 18 ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితమే డ్రైవర్లకు శిక్షణనిచ్చారు. కానీ ఆర్టీసీతో కుదిరిన ఒప్పందంలో లేని ‘డీవైడీ’ అనే మరో సంస్థ తాజాగా ముందుకురావడంతో అధికారులు సందిగ్ధంలో పడిపోయారు. టెండర్లలో దాఖలు చేసిన ఒప్పందానికి భిన్నంగా మరో సంస్థను కొత్తగా చేర్చాలని ప్రతిపాదన రావడంతో ఆర్టీసీ వెనకడుగు వేస్తోంది. ‘సిద్ధార్థ ఇన్ఫోటెక్, ఒలెక్ట్రా, డీవైడీ సంస్థలు సాంకేతికంగా ఒకే మాతృసంస్థకు చెందినవి కావచ్చు. కానీ ఒప్పందంలో ఈ అంశం లేదు. పైగా ఇది 12ఏళ్ల పాటు కొనసాగేది. ఎలాంటి తేడాలు వచ్చినా, నిర్వహణ సంస్థల మధ్య సయోధ్య కొరవడినా అంతిమంగా ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తుంది. అందుకు మేం ఏమాత్రం సిద్ధంగా లేమ’ని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు కొత్తగా డీవైడీ వచ్చి చేరినా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకే ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంటామని సిద్ధార్థ ఇన్ఫోటెక్ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మరో వారం, పది రోజుల్లో ఒప్పందం కుదురుతుందన్నారు. కానీ ఈ పీటముడి తొలగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇవీ ప్రత్యేకతలు...
♦ విద్యుత్‌తో నడిచే ఈ బస్సులు వందశాతం పర్యావరణహితమైనవి.
♦ 4గంటల పాటు చార్జింగ్ చేస్తే 250కిలోమీటర్ల వరకు నడుస్తాయి.
♦ ఏసీ సదుపాయంతో ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.
♦ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా ఈ బస్సులు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment