సుధీర్ కమిటీ సిఫార్సులు అమలుచేయాలి
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితి లో మార్పు తీసుకొచ్చేందుకు సుధీర్ కమిషన్ నివేదికను అమలుచేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ‘సుధీర్ కమిషన్ నివేదిక– ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితి’పై సోమవారం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, సంపాదకుడు జాహెద్‌అలీఖాన్. కోదండరాం మాట్లాడుతూ.. ముస్లింల వెనుకబాటుతనాన్ని సుధీర్ కమిషన్ వెల్లడించిందన్నారు.
వారికి 12శాతం రిజర్వే షన్లను అమలుచేయడమే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సామాజిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి కమిటీ సూచనలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. సదస్సులు, చర్చలతోనే వదిలిపెట్ట కుండా సుధీర్ కమిషన్ నివేదిక అమలు కోసం జిల్లా స్థాయిల్లో పోరాడుతామన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు, ముస్లింలకు మధ్య పంచాయితీ పెట్టొద్దన్నారు. అసెంబ్లీలో దీన్ని చర్చకు పెట్టి, ఆమోదించాలన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ ముస్లింలపట్ల వివక్షత ఉందని యోగేంద్ర ఆరోపించారు. పదేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గాల్లో ముస్లింల సంఖ్య తగ్గిందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుపై అసెంబ్లీలో ఆమోదిం చడంతో పాటు కేంద్రంపైనా ఒత్తిడి తేవాలన్నారు. సదస్సులో జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, గోపాలశర్మ, వెంకటరెడ్డి, బైరి రమేశ్, స్వరాజ్ అభియాన్ నేత ఆదిల్‌అలీ తదితరులు పాల్గొన్నారు.