మండలిలో ఇంజనీరింగ్ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అంశం శాసన మండలిలో శుక్రవారం దుమారం లేపింది. ప్రమాణాల పేరిట కళాశాలల గుర్తింపును రద్దు చేయడం శోచనీయమంటూ విపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం చేతకాకుంటే.. ఆ విషయం చెప్పాలిగానీ, ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయడం తగదని విమర్శించాయి. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దుచేయడంతో సుమారు 90 వేలమంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందని, విద్యార్థుల జీవితాల తో సర్కారు చెలగాటమాడుతోందని కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్ సభ్యులు నిప్పులు చెరిగారు. ఇక మజ్లిస్ ఎమ్మెల్సీ హైదర్ రిజ్వీ అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అస్పష్టంగా సమాధానం ఇవ్వడంతో... విపక్షాలన్నీ ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.
రిజర్వేషన్ పెంచడమంటే ఇలాగేనా..?
ముస్లింలకు విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్‌ను పెంచుతామన్న సర్కారు... ముస్లిం మైనార్టీ సంస్థలకు చెందిన కళాశాలలకు అనుమతిని రద్దు చేసిందని మజ్లిస్ ఎమ్మెల్సీ హైదర్‌రిజ్వీ ఆరోపించారు. అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇచ్చిన కళాశాలలకు సైతం గుర్తింపు రద్దు చేశారని.. అందులో గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న కళాశాలలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పాలేగాని.. కళాశాలలను మూస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. ప్రమాణాలు లేవని ప్రైవేటు కళాశాలలను మూస్తున్న జేఎన్టీయూహెచ్ అధికారులు... ప్రమాణాలు లేకుండానే ప్రభుత్వ కళాశాలలను నడిపించవచ్చా అని నిలదీశారు. మంథనిలోని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 1,104 మంది విద్యార్థులుంటే కేవలం నలుగురే అధ్యాపకులు ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రమాణాలు లేవని తేల్చిన కళాశాలలకు గతంలో అనుమతులిచ్చిన అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రశ్నించారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల నివేదికలను శాసనమండలికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు చైర్మన్‌ను కోరారు. దీనిపై సభాసంఘం వేసి సభ్యుల సందేహాలను తొలగించాలని విపక్ష నేత డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఆన్‌లైన్‌లో చూసుకోండి..
ఇంజనీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూహెచ్ మూడు దఫాలుగా నిర్వహించిన తనిఖీల నివేదికలను వర్సిటీ వెబ్‌సైట్లో ఉంచామని.. మండలి సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చూసుకోవచ్చని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. గుర్తింపు రద్దు కేవలం ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు రద్దయిన కళాశాలల్లో 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ను ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తుందని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, గుర్తింపు రద్దు విషయంలో ఎటువంటి వివక్ష చూపలేదని కడియం పేర్కొన్నారు. తనిఖీ నివేదికలపై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. కాగా.. తనిఖీ నివేదికలను వర్సిటీ వెబ్‌సైట్లో ఉంచామని చెప్పి ఉప ముఖ్యమంత్రిని కూడా జేఎన్టీయూహెచ్ అధికారులు తప్పుదోవ పట్టించారని టీడీపీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఆరోపించారు.