పేరు గొప్ప వ్యవస్థ.. ఎన్నేళ్లీ అవస్థ? | Ennelli dying of a great system ..? | Sakshi
Sakshi News home page

పేరు గొప్ప వ్యవస్థ.. ఎన్నేళ్లీ అవస్థ?

Published Fri, Mar 14 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

Ennelli dying of a great system ..?

  • ‘గ్రేటర్’ నగరం చూడర బాబూ..
  •      కనీస సదుపాయాలూ లేవు
  •      పన్నుల వసూళ్లలో ఫస్ట్..
  •      సౌకర్యాల కల్పనలో లాస్ట్
  •      ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్యలు
  •   సాక్షి, సిటీబ్యూరో: చినుకు పడితే వణుకు..
     రోడ్డెక్కాలంటే గుబులు..
     రోజూ నీళ్లందక దిగులు..
     ఆహ్లాదం, ఆటలు కరువు..
     చెత్తాచెదారానికి నెలవు..
     ఏళ్లుగా అవే సమస్యల దరువు..
     ఇదీ మహా నగర ‘చిత్తరువు’.
     
    రోడ్లు, కాలువలు, పారిశుధ్యం, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, చెరువులు, ఆటస్థలాలు.. ఇవన్నీ కనీస సౌకర్యాలు. పేరు గొప్ప గ్రేటర్ హైదరాబాద్‌లో వీటిలో ఒక్కటీ సవ్యంగా లేవు. పైగా ఇవన్నీ నిన్నా మొన్నటి సమస్యలు కావు. కానీ వీటిని తీర్చేందుకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ‘పదవీ కాలాలు’ సరిపోవట్లేదు. ప్రతిసారీ ఎన్నికల్లో మీ సమస్యలు తీరుస్తామని హామీలివ్వడం, గెలిచాక వాటిని గాలికొదిలేయడం రివాజైంది. దీంతో సమస్యలు కాస్తా మహా నగరాన్ని వదలని గుదిబండలుగా మారుతున్నాయి.

    అధికారులదీ అదే తీరు.. ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డులు తిరగరాస్తున్నా.. సదుపాయాల కల్పనలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూడు, గూడు, గుడ్డ, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు, ట్రాఫిక్ ఇబ్బందులు- గోతులు గొప్పులు లేకుండా సాఫీగా ప్రయాణించేందుకు అనువైన మార్గాలు, పారిశుధ్యం, పార్కులు, ఆటస్థలాలు, వీధిదీపాలు.. ఇవే ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు. ఇవుంటే చాలు నగరం నందనవనం అవుతుంది. ఐదేళ్లకోసారి ఎన్నికల జాతర.. ఎడాపెడా హామీల వెల్లువ.. నేతలు, అధికారులు మారుతున్నారు. కానీ నగరం తలరాత మాత్రం మారట్లేదు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ‘సారీ’.. సమస్యలింతేనా?. కనీస సదుపాయాలు సమకూరేనా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పిస్తే చాలని ఆశిస్తున్నారు. ఇదే ఈనాటి ‘ప్రజా ఎజెండా’.
     
    తీరనివి కాదు.. పరిష్కరించే తీరికే లేదు!
     
    నిజానికి కొన్ని తీరని సమస్యలు కావు. నగరంలో ఇంటి చిరునామా కనుక్కోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇంటి నెంబర్ల ప్రక్రియ అంత గజిబిజిగాఉంటుంది. దీన్ని సరళం చేసేందుకు చేపట్టిన నెంబర్ల విధానం అతీగతీ లేదు. ఇక, ఆయా ప్రాంతాలకు ‘దారి చూపే’ సైనేజీల ఏర్పాటూ దారీతెన్నూ లేదు. ప్రజావాణి, ఫోన్‌ఇన్, ముఖాముఖి వంటి కార్యక్రమాల పేరిట ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ ఫిర్యాదులు తీసుకుంటున్నారే తప్ప పరిష్కరించట్లేదు. ఒక్కసారి ఒక సమస్య గురించి ఫిర్యాదు చేస్తే.. నిర్ణీత వ్యవధిలోగా దాన్ని పరిష్కరించే వ్యవస్థ కావాలని ప్రజలు కోరుతున్నారు.
     
    సమస్యలన్నీ తీరాలంటే..
     
    గ్రేటర్ ప్రజలు సమస్యలన్నీ తీరి సదుపాయవంతమైన జీవనం గడపాలంటే ఏం చేయాలో లెక్కలేనన్ని లెక్కలు వేశారు. అంచనాలు రూపొందించారు. ఏవీ కాగితం దాటలేదు. ఉదాహరణకు దిగువ పేర్కొన్న నిధులతో అభివృద్ధి పనులు చేయాలని గతంలో ప్రతిపాదనలు తయారుచేశారు. వీటిలో పది శాతం మేర కూడా పనులు జరగలేదు. కనీసం దశలవారీగానైనా వీటిని చేపట్టి ఉంటే ఈసరికి పూర్తయి ఉండేవి.
     నాలాల అభివృద్ధి        రూ.10 వేల కోట్లు
     రోడ్ల అభివృద్ధి         రూ.4000 కోట్లు
     ఫ్లైఓవర్లు            రూ.4500 కోట్లు
     
      ప్రయాణం.. అధ్వానం
     రోడ్ల నిండా గుంతలే. పట్టుమని పది కిలోమీటర్ల రహదారి కూడా సాఫీగా ప్రయాణించే పరిస్థితి లేదు. అడుగుతీసి వేయాలన్నా ‘నడక’యాతనే. ప్రజావసరాలకు తగిన విధంగా రహదారులు నిర్మించడంతో పాటు, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చూడాలని జనం కోరుతున్నారు. టోలిచౌకి, అంబర్‌పేట, బాలానగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం, ఉప్పుగూడ, కందికల్‌గేట్, సఫిల్‌గూడ, తుకారాంగేట్ ప్రాంతాల్లో ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు, బార్కాస్, బజార్‌ఘాట్, మూసాపేట, మియాపూర్, మొఘల్‌కానాలా, న్యూరహ్మత్‌నగర్, కవాడిగూడ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు పడకేశాయి. మొత్తం నగర రోడ్ల విస్తీర్ణంలో 30 శాతం మేర కూడా ప్రయాణానికి అనువుగా లేవు. పలుచోట్ల మరమ్మతులు, కొత్త రోడ్లు వేయాల్సి ఉంది.
     గ్రేటర్‌లో రోడ్ల పొడవు:     6411 కి.మీ.లు
     బీటీ రోడ్లు:         2280 కి.మీ.లు
     సీసీ రోడ్లు:         2080 కి.మీ.లు
     మట్టి రోడ్లు:         1660 కి.మీ.లు
     
      ‘చెత్త’శుద్ధి ఏదీ?
     ఎటుచూసినా చెత్తకుప్పలు.. అంతటా పేరుకుపోయిన చెత్తాచెదా రం.. రూ.కోట్లు వెచ్చిస్తున్నా పారిశుధ్యం పరిస్థితిలో మార్పు లేదు. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతున్న చెత్తకుప్పలతో, పొంగిపొర్లుతున్న మురుగునీటితో నగర ప్రజలు దుర్భరంగా గడుపుతున్నారు. తరచూ రోగాల పాలవుతూ  ఆస్పత్రులకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
     
      శివార్ల గోడు..
     శివార్ల పరిస్థితి మరీ దుర్భరం. అందరి నుంచీ వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ శివార్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సవతి ప్రేమ చూపుతోంది. శివార్లలోని 30 లక్షల మంది తాగునీటికీ నోచట్లేదు. కొన్నిచోట్ల వారానికోసారి.. ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు వారాలకోమారు సరఫరా చేస్తున్నారు. రోజూ నీటి సరఫరాకు స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలి. శివార్ల నీటి అవసరాలు తీర్చేందుకు రూ.2400 కోట్లతో 2008లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇక రోడ్లు, వీధిదీపాలు, పార్కులు, ఆటస్థలాల ఏర్పాటు.. అన్నింటా పక్షపాతమే. దీన్ని తొలగించి శివార్లలో సంపూర్ణ మౌలిక సదుపాయాలు కావాలంటున్నారు.
     
      చూడు చూడు జాడలు
     గుడిసెల్లేని నగరంగా మారుస్తామంటున్న పాలకుల మాటలు నీటిమూటలే అవుతున్నాయి. పథకాలు, నిధులు పుష్కలం.. పనులు నిష్ఫలం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చిత్తశుద్ధి లోపం వల్లే మురికివాడల స్థితిగతులు మారడం లేదని జనం అంటున్నారు.
     
      గుండె‘చెరువే’..
     ‘ఇదిగో.. ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది తెలుసా?’ అని చెప్పుకోవాల్సిన దుస్థితి.. ఇప్పటికే అంతమైపోయిన చెరువులు పోను, మిగతా వాటినైనా పరిరక్షించాలని,అవి కుంచించుకుపోకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెరువుల పరిరక్షణకు రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తున్నా  ఆ మేరకు పురోగతి కరువవుతోంది.
     
     వానొస్తే హైరానా
     నాలుగు చినుకులు పడితే నగరం చిగురుటాకులా వణుకుతోంది. వానొచ్చిన ప్రతిసారీ వరద బీభత్సం నెలకొంటోంది. వాన నీరు వెళ్లే మార్గాల్లేవు. అందుకోసం చేపట్టిన ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తవుతున్న దాఖలాల్లేవు. ఇక, మ్యాన్‌హోళ్లలో పడి మనుషులు కొట్టుకుపోతున్నారు. నడిరోడ్లు కళ్లెదుటే కుంగిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చే వాళ్లు కావాలంటున్నారు జనం. 70 కి.మీ.ల మేర నాలాల అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా, 20 కి.మీ.ల మేర కూడా పూర్తి కాలేదు.
     
     రోడ్లన్నీ శిథిలావస్థలో..
     రాజేంద్రనగర్ పరిధిలో రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు గోతులమయంగా మారి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.
     - పి.శ్రీధర్, బుద్వేల్, రాజేంద్రనగర్
     
     అభివృద్ధి జాడలేదు
     రాజేంద్రనగర్ సర్కిల్‌లో అభివృద్ధి పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టం లేదు. కొత్త వాటి ఊసే లేదు. రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలు యాతనకు గురిచేస్తున్నాయి.     - పి.మహేష్, ఉప్పర్‌పల్లి
     
     ‘చెత్త’గా ఉంది

     మా ప్రాంతంలో చెత్త తొలగింపులో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిరక్ష్యం చూపుతున్నారు. అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారడంతో రాకపోకలు సాగిం చాలంటే  నరకం కనబడుతోంది.
     - కృష్ణచైతన్య, అడ్డగుట్ట సొసైటీ నివాసి
     
     పర్యవేక్షణ లేకే..
     కేపీహెచ్‌బీకాలనీ 6వ ఫేజ్‌లో అంతర్గతరోడ్లు అధ్వానంగా మారాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పారిశుధ్య సిబ్బంది సరిగా పని చేయట్లేదు. జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణ లోపం వల్లే ఈ దుస్థితి నెలకొంది.
     - రఘునాథ్‌రెడ్డి, కేపీహెచ్ బీ కాలనీ, 6వ ఫేజ్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement