చినుకు పడితే చిత్తడే
పటాన్‌చెరు: పట్టణంలోని గోనెమ్మ బస్తీ చౌరస్తా చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ మార్గం మీదుగా పోస్టాఫీసు, మున్సిపల్, మసీదు, పలు గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగింస్తుంటారు. వాహనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. వర్షపు నీరు వెళ్లడానికి సరైన సదుపాయం లేకపోవడం, రోడ్డు గుంతలమయంగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల రోడ్డును తవ్వి పైప్‌లైన్ వేశారు. దీంతో రోడ్డు మరింత దెబ్బతింది. పైప్‌లైన్ వేసిన ప్రాంతంలో వాహనాలు దిగబడుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. రోడ్డుపై నీరు నిలవడంతో పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.