రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలం
కేసీఆర్, బాబులది గురుశిష్యుల కొట్లాట: శాసనమండలి సీఎల్పీ నేత డీఎస్
హైదరాబాద్: కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శాసనమండలి సీఎల్పీ నేత డి.శ్రీనివాస్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులది గురుశిష్యుల కొట్లాటగా ఆయన అభివర్ణించారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలేదని విమర్శిం చారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాల్సిందేనని, చంద్రబాబు సహకరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని పోవడం లేదని, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరితేనే పనులు చేస్తామని కండిషన్లు పెడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.