సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో వైరస్ నియంత్రణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజులపాటు ఇళ్లకే పరి మితం చేయాలని నిర్ణయించింది. కోవిడ్ వైరస్ అనుమానిత లక్షణాలున్నా, లేకున్నా అలాంటి వారంతా ఇళ్లలోనే ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చిన కొందరు ప్రయాణికుల్లో వారం పది రోజు లకు వైరస్ లక్షణాలుబయటపడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
వైరస్ లక్షణాలు ఆలస్యంగా బయటపడుతుండటంతో...
హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం సగటున 3 వేల నుంచి 3,500 మంది వరకు విదేశాల నుంచి చేరుకుంటున్నారు. కోవిడ్ కేసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 50,679 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిలో ప్రతిరోజూ 50–60 మందికి కోవిడ్ అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తిస్తుండగా సగటున 25–30 మందిని ఐసోలేషన్‌లో ఉంచి వారి శాంపిళ్లను తీసుకుంటున్నారు. మిగిలిన వారిని ఇళ్ల వద్దనే ఐసోలేషన్ చేస్తున్నారు. అయితే ఇటీవల విదేశాల నుంచి వస్తున్న వారిలో విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్‌లో తొలుత కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తరువాత అవి బయటపడుతున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి.
ఇటీవల తెలంగాణలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసులో విదేశాల నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తొలుత వైరస్ లక్షణాలేవీ లేవు. పది రోజుల తరువాత కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారు ఎవరైనా వారిని ఇళ్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ప్రతిరోజూ దాదాపు 3 వేల మందిని హోమ్ ఐసొలేషన్ చేయాల్సి ఉంటుంది. వారి హోమ్ ఐసోలేషన్ పర్యవేక్షణ బాధ్యతను స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి ప్రభుత్వం అప్పగించింది.
ఎయిర్‌పోర్టు నుంచి వివరాల సేకరణ...
ఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుల వివరాలన్నింటినీ అధికారులు సేకరిస్తున్నారు. ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకోగానే స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి వారి వివరాలను పంపుతారు. తద్వారా వారు హోం ఐసొలేషన్‌లో ఉన్నారా లేదా అనే విషయాన్ని స్వయంగా వెళ్లి పరిశీలిస్తారు. ఇలా అన్ని అంశాల్లో పకడ్బందీగా వ్యవహరిస్తే తప్ప కోవిడ్ వైరస్‌ను కట్టడి చేయలేమని ప్రభుత్వం భావిస్తోంది.
ఒకవేళ ఒకేసారి ఎక్కువ మంది వస్తే వారందరినీ ఐసొలేషన్‌లో ఉంచేలా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేయాలన్నది మరో కీలకమైన నిర్ణయం. ఇందుకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 5 వేల పడకలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ వైద్య బృందాలను పెట్టాలని, కరపత్రాలు పంచాలని యోచిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో గురువారం మొదటిసారిగా కోవిడ్ పరీక్ష నిర్వహించారు. అవే శాంపిళ్లను పుణేకు పంపి ఇక్కడ చేసే పరీక్షల కచ్చితత్వాన్ని పరిశీలిస్తున్నారు.
సభలు, సమావేశాలు వద్దు...
బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కోవిడ్‌పై ఏర్పాటైన రాష్ట్రస్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలో గురువారం రాత్రి కమిటీ సమావేశమైంది. ఈ భేటీ వివరాలను ఈటల ఒక ప్రకటనలో వెల్లడించారు. కొన్ని రోజులపాటు సదస్సులు, సెమినార్లను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈటల కోరారు. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్‌తో చేరిన వ్యక్తికి పూర్తిగా నయమైందని, అతన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టాండింగ్ థర్మో స్క్రీనింగ్‌లు అందించామన్నారు.
విమానాశ్రయంలో ప్రతి ప్రయాణికుడిని స్క్రీన్ చేస్తున్నామన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారు కచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే (ఐసోలేషన్) ఉండాలన్నారు. కుటుంబ సభ్యులను లేదా బయటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ కలవరాదన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 104 కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తాయని, వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విన్నవించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక అధికారి శ్రీదేవి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment