వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ కృష్ణమాచార్యులు
సాక్షి, మధిర: నాడు వేలాదిమంది రోగులను పరీక్షించి, వందలాదిమంది రోగులకు ప్రాణం పోసిన ప్రజా వైద్యుడు నేడు అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులతో మంచంలో మగ్గుతున్న కడుదయనీయ పరిస్థితి. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామానికి చెందిన నరగిరి నాధుని వెంకటాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు కృష్ణమాచార్యులు 1941, ఏప్రిల్ 30న జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తిచేసుకుని విజయవాడలో ఆయుర్వేద వైద్యకోర్సును చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో హౌస్ సర్జన్ పూర్తిచేసి నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పులిచెర్ల గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేసి అక్కడి ప్రజల మన్ననలు పొందారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామానికి వచ్చారు.
ఆధునిక దేవాలయంగా పిలువబడే నాటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసిన ప్రముఖ ఇంజనీర్ మాటూరు గోపాలరావు స్వగ్రామం కూడా మాటూరే. ఆయన సూచనలమేరకు ఆయన తండ్రి అప్పారావు పేరుతో, ఆయన నివాసంలో ప్రజా వైద్యశాలను స్థాపించారు. ఉచిత ఆస్పత్రిని నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండుమూడు దశాబ్దాలకుపైగా మధిర ప్రాంతానికి చెందిన వందలాదిమంది రోగులకు సేవలు చేశారు. వేలాదిమందికి ఉచిత వైద్యసేవలు అందించారు. ఒకవైపు మాటూరులోని చెన్నకేశవస్వామి, రామాలయంలో అర్చకత్వం చేస్తూ మరోవైపు డాక్టర్‌గా సేవలందించారు.జలగం వెంగళరావు సహకారంతో ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్ మంజూరు చేయించడం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వెన్నుముకకు గాయమై..
మూడు దశాబ్దాలపాటు ఉచిత వైద్యసేవలు అందించిన తరువాత కృష్ణమాచార్యుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న కొంతమంది రోగులు జబ్బు తగ్గిన తరువాత కొంత డబ్బును ఆయనకు ఇచ్చేవారు. ఈ ప్రాంతానికి చెందిన బంధువులు, స్నేహితులు కృష్ణమాచార్యులు వైద్య సేవల గురించి తెలుసుకుని దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యసేవలు పొందేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన కోసం మాటూరుకు వచ్చేవారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కృష్ణమాచార్యుల వెన్నుముకకు దెబ్బ తగిలింది.
ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఆయన ప్రస్తుతం మంచంలో మగ్గుతున్నారు. మంచంలో ఉన్నప్పటికీ ఆయన వద్దకు ఇప్పటికీ రోగులు వస్తుండటం గమనార్హం. వెన్నుముక సమస్యతో పాటు గుండె సమస్య కూడా వేధిస్తోంది. పెద్దాస్పత్రులకు వెళ్లేందుకు ఆయన చేతిలో చిల్లిగవ్వలేదు. నాడు వేలాదిమంది రోగులకు ఉచిత వైద్యసేవలందించిన కృష్ణమాచార్యులను ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ‘అబ్బాయి గారు’గా ఆప్యా యంగా పిలుచుకోవడం విశేషం. ప్రభుత్వం సహకారం అందిస్తే.. ఆయన కోలుకునేందుకు, ఆర్థిక చేయూత పొందేందుకు అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment